»14 Of The 20 Most Air Polluted Cities On Earth Are India
Air polluted cities: అత్యంత వాయు కాలుష్యం కలిగిన 20 నగరాల్లో 14 మనవే
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాలను తాజాగా ప్రకటించారు. 20 ప్రాంతాలు ఉంటే వాటిలో 14 ఇండియా నుంచే ఉండటం భయాందోళన కలిగిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం మనం పీల్చే గాలి మొత్తం కలుషితమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దాదాపు మొత్తం ప్రపంచ జనాభాలో (99%) గాలి నాణ్యత పరిమితులను మించిన కలుషిత గాలిని పీల్చుతున్నారని ప్రకటించింది. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం మనం పీల్చే గాలి మొత్తం కాలుషితమైనదేనని చెప్పవచ్చు. అంతేకాదు వాయు కాలుష్యం కారణంగా ఏడాదికి 7 మిలియన్ల అకాల మరణాలు నమోదవుతున్నాయని తెలిపింది. వాయు కాలుష్యం ఉన్న ప్రధాన నగరాలను ఎంపిక చేయడానికి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2022 ప్రకారం సగటు PM2.5 సాంద్రత కలిగిన నగరాలను ఎంపిక చేశారు.
ఈ జాబితాలో పాకిస్తాన్లోని లాహోర్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ అధిక వాహన, పారిశ్రామిక ఉద్గారాల కలయికతో పాటు ఇటుక బట్టీల నుంచి వచ్చే పొగ, పంట అవశేషాలు, సాధారణ వ్యర్థాలను కాల్చడం, నిర్మాణ స్థలాల నుంచి వచ్చే ధూళి వల్ల గాలి కాలుష్యం పెరిగిపోయింది.
మరోవైపు ఇండియాలో పెరుగుతున్న జనాభాతోపాటు వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక రంగం ఫలితంగా ఈ జాబితాలో ఇండియా నుంచి 14 నగరాలు ఉండటం చాలా డేంజర్ అనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యంలో చైనాను ఇండియా మించిపోయింది. ఈ లిస్టులో ఆఫ్రికన్ దేశం నుంచి ఒక్కటే చాడ్ నగరం ఉండటం విశేషం.
ఈ నగరాల్లో కింది కాలుష్య కారకాల సాంద్రత ప్రమాదకర స్థాయిలో ఉందని ప్రకటించారు
నేల స్థాయి ఓజోన్
నలుసు పదార్థం
కార్బన్ మోనాక్సైడ్
సల్ఫర్ డయాక్సైడ్
నైట్రోజన్ డయాక్సైడ్
ఈ కాలుష్య గాలి పీల్చుకోవడం వల్ల రక్తప్రవాహంలోకి ఎక్కువగా శోషించబడుతుంది. దీంతో స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు సహా క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ 2020 అధ్యయనం ప్రకారం 2019లో వాయు కాలుష్యం కారణంగా 6.67 మిలియన్ల మంది మరణించారు.