తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై సోమవారం (డిసెంబర్ 5) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసులో తాను అరెస్టయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. నన్ను ఆ రోజు అన్యాయంగా జైల్లో పెట్టారని, కనీసం తన బిడ్డ లగ్నపత్రికకు వెళ్లకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నీ బిడ్డ (కవిత) ఇంటికి సిబిఐ వస్తుందని, ఇప్పుడు ఆ నొప్పి ఏంటో నీకు తెలుస్తుందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
నేతలు పార్టీ మారడంపై కేసీఆర్ ఆందోళన చెందే అంశంపై కూడా రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. మా తాండూరు ఎమ్మెల్యేను కొనుగోలు చేసింది నువ్వు కాదా, 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదా అని నిలదీశారు. ఇప్పుడు వగల ఏడుపు ఏడుస్తున్నారని, నీ పార్టీ చీలికలకు, పేలికలుగా మారిపోవడం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తే తన కొడుకుకు ఎదురు లేకుండా ఉంటుందనేది కేసీఆర్ అభిప్రాయమని, కాంగ్రెస్ ఆవు వంటి పార్టీ అని, ఇలాంటి పార్టీని మోసం చేసిన పాపం ఊరికే పోదన్నారు.
ముఖ్యమంత్రి పదవిపై రేవంత్… ఎన్నికలపై…
తాను ముఖ్యమంత్రి కావాలని తనవాళ్లు చాలామంది భావిస్తున్నారని, కానీ నేను సీఎంను అయినా కాకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చునని, కేసీఆర్ ఎన్నికల కోసం తొందరపడుతున్నారని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. తెరాస పాలనలో కొడంగల్ తుప్పుపట్టిందని, కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లనే ఇలా జరిగిందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఆడుతున్న గేమ్ అన్నారు.