దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 5) నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, దాదాపు ఏ దశలోను కోలుకోలేదు. ఒకటి రెండుసార్లు లాభాల్లోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ, అంతలోనే నష్టాల్లోకి వెళ్లాయి. అయితే చివరకు నష్టాలు మాత్రం తగ్గాయి. వరుస లాభాల అనంతరం ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో రెండో రోజు మార్కెట్లు క్షీణించాయి. సెన్సెక్స్ స్వల్ప నష్టాల్లో ముగియగా, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 62,865 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, ఓ సమయంలో 350 పాయింట్లకు పైగా నష్టపోయి 62,507 పాయింట్లకు పడిపోయింది. అదే సమయంలో 62,939 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 33 పాయింట్ల నష్టంతో 62,834 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 18,701 పాయింట్ల వద్ద ముగిసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్ వంటి దిగ్గజ సంస్థల స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.23 శాతం, స్మాల్ క్యాప్ 0.43 శాతం లాభాలతో ముగిశాయి. వివిధ రంగాలు మిశ్రమంగా ముగిశాయి. మెటల్ మాత్రం అదరగొట్టింది. కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా నవంబర్ సర్వీసెస్ పీఎంఐ డేటా మద్దతు లభించింది. భారత సర్వీస్ సెక్టార్ ఔట్ పుట్ గ్రోత్ నవంబర్ నెలలో మూడు నెలల గరిష్టానికి చేరుకుంది.
డిసెంబర్ ఏడో తేదీన ఆర్బీఐ పాలసీ ప్రకటనపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. మార్కెట్ గరిష్టాలను తాకడంతో ప్రాఫిట్ బుకింగ్ కూడా కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ షేర్లు లాభాల్లో ముగియగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.