SKLM: ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు యువ నేత వెంకట చిరంజీవి నాగ్ శనివారం ఆయన ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. తల్లికి వందనం పథకానికి చంద్రబాబు మంగళం పాడారని, అలాగే నాన్నకు ఇంధనం పేరుతో నారావారి సారా స్రవంతిలో కొత్తగా మద్యం పాలసీ తెచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
GNTR: తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలపటంపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు కోరారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డు కలుషితంపై హిందూ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు. వైసీపీ నేతలు చేసిన లడ్డు అక్రమ తయారీపై ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
విశాఖ: కొయ్యూరు మండలంలోని డౌనూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో శనివారం శ్రమదానంతో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, భోజన శాల ప్రాంతాలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను, పొదలను తొలగించారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: సీతంపేట ఐటీడీఎ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలకు ఆహార పదార్ధాలు సరఫరాకి ఐటీడీఎ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జీసీసీ టెండర్లను నిర్వహించింది. ఈ సందర్భంగా 31 వస్తువులు సరఫరాకి టెండర్లు నిర్వహించారు. 11 మంది టెండర్ దారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ అన్నదొర, జీసీసీ డీఎం సంధ్యారాణి, పాల్గొన్నారు.
KRNL: స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని నందమూరి తారక రామరావు పార్కులో పనికిరాని వస్తువులతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటుచేశారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాల మేరకు డీఈఈ నీరజ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు. శనివారం దానిని ప్రారంభించగా మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
E.G: బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక” కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఉపాధి హామీ పథకం అమలులో ఎటువంటి అక్రమాలు జరిగిన సహించేది లేదని హెచ్చరించారు.
ELR: రైతులు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టి అధిక దిగుబడి పొందాలని ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు అన్నారు. శనివారం నారాయణపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలకనంద శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సిబ్బంది మౌనిక సోనీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
W.G: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏలూరుపాడు అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదంపై స్పందించారు. శనివారం ఆయన మాట్లాడారు. “ఏలూరుపాడు మా అమ్మమ్మగారి ఊరు. అటుగా వెళుతున్న సమయంలో అక్కడ ఉండే నాగేంద్ర స్వామి గుడిని మూసేసి అంబేడ్కర్ ఫ్లెక్సీ కట్టారు. గుడిపై ఇద్దరు కూర్చొని ధూమపానం చేశారు. అది చూసి ఫ్లెక్సీని తొలగించానన్నారు.
NLR: కావలి రూరల్ మండలంలోని నడింపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి నేతలు నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ.. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత జనార్ధన్, నేతలు తదితరులు పాల్గొన్నారు.
WG: ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ శనివారం పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను హెడ్‌మాస్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో విడివిడిగా ముచ్చటించారు.
KRNL: కర్నూలులోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు MP బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కోనసీమ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం ఉదయం రామచంద్రపురం విఎస్ఎం కాలేజీ నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
VSP: విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ పేర్కొన్నారు. శనివారం పాడేరులో ఎస్ఎఫ్ఐ నేతలు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా ఎస్ఎఫ్ఐ పాడేరు మండల కమిటీని ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ పాడేరు మండల అధ్యక్షుడుగా పీ.ఆనంద్, సెక్రటరీగా సింహాద్రి, వైస్ ప్రెసిడెంట్‌గా సాయికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
SKLM: భారతీయ విద్యా కేంద్రం ఆర్ష విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యా యలు చిన్న కర్రీవాణిపాలెం, బట్టివాణిపాలెంలో శనివారం రోజున సముద్ర జలాల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్లాస్టిక్ వల్ల స్థానికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కవిటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
KDP: మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ సబ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చేయి, చేయి కలిపి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.