ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా.. తాజాగా.. పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు పై జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ పై మంత్రి రోజా స్పందించారు.
పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ముందు సర్పంచ్‌లుగా గెలవండి.. తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి చురకలంటించారు.
ప్యాకేజీలు తీసుకుని వేరే పార్టీలకు ఓటు వేయమని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని సెటైర్లు పేల్చారు. ఎన్టీఆర్, చిరంజీవి పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీచేస్తే.. పవన్ మాత్రం 2014లో ప్యాకేజీకి ఆశపడ్డారని విమర్శించారు. ప్యాకేజీల కోసమే పవన్ విమర్శలు చేస్తున్నారని.. పవన్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే అంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్ మీటింగ్‌లకు వస్తున్నారన్నారు. పవన్‌కు సింగిల్‌గా పోటీచేసే దమ్ములేదన్నారు రోజా.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు మంత్రి. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి కరకట్టలో దాక్కున్న చంద్రబాబును ఎందుకు నిలదీయలేదన్నారు. విభజన చట్టంలో ఏపీ ఆస్తులపై పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ఉన్నారని.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే సంక్షేమ పాలనకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు.