Ambati Rambabu:ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (Ambati Rambabu) మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు జీవితం ఆంబోతులకు ఆవులను సప్లై చేయడమేనని స్పష్టంచేశారు. తనను పట్టుకొని ఆంబోతులకు ఆంబోతు అన్నారని మండిపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మూడు ప్రశ్నలు వేస్తే ఇప్పటివరకు సమాధానం చెప్పలేదన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు..? ప్రాజెక్ట్ నిర్మాణం భారాన్ని కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదు..? డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మాటేమిటి? అని అడిగారు. ఇరిగేషన్ మీద తాను వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇదీ కాక బ్రో మూవీ గురించి మాట్లాడటం ఏంటీ అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చాలా సినిమాలు చేశారని.. వాటి గురించి తాను ఎప్పుడైనా మాట్లాడానా అని ప్రశ్నించారు. బ్రో సినిమాలో తమపై విమర్శలు చేశారని.. తమను గిల్లడంతో రియాక్ట్ కావాల్సి వచ్చింది.
బ్రో మూవీకి పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత ఇచ్చారో నిర్మాత కూడా చెప్పాలని అడిగారు. వారాహి ఎక్కి పారదర్శకంగా ఉండాలని పవన్ ఊగిపోతారని.. తన రెమ్యునరేషన్ గురించి మాత్రం చెప్పారని అన్నారు. రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటానని.. మరీ బ్రో మూవీకి ఎంత తీసుకున్నారో ఎందుకు చెప్పడం లేదన్నారు. ఇందులో రహస్యం ఏంటీ.? మతలబు ఏంటీ అని అడిగారు.
చంద్రబాబు హయాంలో రాయలసీమంలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తెలుగు గంగ డిశ్చార్జ్‌ను పెంచిన ఘనత వైఎస్‌ది అని.. వైఎస్‌తోపాటు ఎన్టీఆర్ కూడా రాయలసీమకు న్యాయం చేశారని వివరించారు.