»Home Sites For All Ttd Employees Chairman Bhumana Karunakar Reddy
TTD ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు : ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 18న సీఎం జగన్ చేతుల మీదుగా ఇంటి స్థలాలు ఇప్పించనున్నట్లు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi devasthanams)లో పనిచేసే ఉద్యోగులందరికీ టీటీడీ (TTD) ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana karunakar reddy) శుభవార్త చెప్పారు. టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. వడమాలపేట వద్ద తమ ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 310 ఎకరాల భూమిని ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఉద్యోగ సంఘాలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.
సెప్టెంబర్ 18వ తేదిన సీఎం జగన్ (Cm Jagan) చేతుల మీదుగా ఇళ్ల స్థలాలను ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అవసరమైతే మరో 100 ఎకరాలైనా కూడా అధికార ప్రభుత్వం నుంచి సేకరించి ఇంటి స్థలాలు ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. భూమన ప్రకటనతో టీటీడీ ఉద్యోగుల్లో (TTD Employees) ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీ (TTD) ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించినట్లు గుర్తు చేశారు. పదేళ్ల పాటు ఆ సమస్యను ఎవ్వరూ పట్టించుకోలేదని, జగన్ సీఎంగా ఉండటం వల్లే మళ్లీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు వస్తున్నాయని తెలిపారు. దాదాపుగా 7 వేల మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు వస్తాయని, దాని వల్ల పెద్ద టౌన్ షిప్ తయారవుతుందని ఈవో ధర్మారెడ్డి (Eo Dharmareddy) వెల్లడించారు.