సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే వచ్చేసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీ ఫౌండేషన్ శుక్రవారం తెలిపింది. లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారని, అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తారని తెలిపింది. ఆయనకు వివిధ పార్టీల నుండి ఆహ్వానం ఉంది. అయినప్పటికీ ఇండిపెండెంట్‌కు మొగ్గు చూపుతున్నారు. విశాఖ నుండి పోటీ చేస్తానని ఆయన గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. అయితే ఏ పార్టీ నుండి అనేది స్పష్టత ఇవ్వలేదు. సిద్ధాంతాల విభేదాలు, ఇతర అంశాల కారణంగా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించారు.
తాను గెలిచిన తర్వాత తన సిద్ధాంతానికి దగ్గరగా ఉన్న పార్టీకి మద్దతు ఇస్తానని చెబుతున్నారు. విశాఖ ప్రజలు తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఇచ్చారని, అందుకే ఇక్కడి నుండి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2019 లోకసభ ఎన్నికల్లో వైసీపీ నుండి ఎంవీవీ సత్యనారాయణ, టీడీపీ నుండి భరత్, జనసేన నుండి వీవీ లక్ష్మీనారాయణ, బీజేపీ నుండి పురంధేశ్వరి పోటీ చేశారు. 2014 నుండి టీడీపీ, బీజేపీ, జనసేనలు ఒక్కటే అనే ప్రచారం ప్రజల్లో ఉంది. కానీ ఎన్నికల్లో మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడంతో వైసీపీ సత్యనారాయణ నాలుగువేల ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ నుండి గెలిచిన సత్యనారాయణకు 4,36వేల ఓట్ల పై చిలుకు రాగా, టీడీపీ అభ్యర్థికి 4.32 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. మొదటి నుండి ప్రచారం జరిగినట్లు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటైతే వైసీపీకి భారీ ఓటమి తప్పకపోవచ్చునని అంటున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు కలిపి 7.5 లక్షల వరకు ఓట్లు వచ్చాయి. జనసేనకు 2.88 లక్షల పై చిలుకు, బీజేపీకి 33వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
2019లో జనసేన నుండి పోటీ చేస్తేనే లక్ష్మీనారాయణకు 2.88 లక్షల ఓట్లు వచ్చి, మూడో స్థానంలో నిలిచారు. అప్పుడు పార్టీ ఉంటేనే వెనుకబడ్డారని, కానీ ఇప్పుడు ఏ పార్టీ లేకుండా పోటీ చేయాలని ఎందుకు భావిస్తున్నారనే చర్చ సాగుతోంది. రాజకీయాల్లో గెలుపోటములను పక్కన పెడితే లక్ష్మీనారాయణకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఓ పార్టీకి అతుక్కుపోయి, ఇతర పార్టీల సానుభూతిపరుల మద్దతుకు దూరమయ్యే బదులు, అందరి మద్దతు చూరగొనాలని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తే కొన్ని పార్టీలు పోటీకి దూరం జరిగి, మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. వివిధ కారణాల కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీల నుండి మద్దతు వచ్చే అవకాశముంటుందని లేదంటే పార్టీలు పొత్తు పెట్టుకుంటే మరీ సులభం అవుతుందని అంటున్నారు. అవసరమైతే మద్దతు కోసం ఆయన ఆయా పార్టీలకు విజ్ఞప్తి చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.