»Chandrababu Released From Rajahmundry Jail Tdp Leaders Are Emotional
Chandrababu: రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల.. భావోద్వేగంలో టీడీపీ శ్రేణులు!
రాజమండ్రి జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల అవ్వడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేనని అన్నారు. ప్రపంచంలోని తెలుగువారందరికీ బాబు ధన్యవాదాలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Develppement scam Case)లో ఆయన 53 రోజులుగా రిమాండ్లో ఉన్నారు. నేడు ఆయనకు ఏపీ హైకోర్టు (Ap High court) మధ్యంతర బెయిల్ (Bail)ను మంజూరు చేయడంతో మంగళవారం సాయంత్రం ఆయన జైలు నుంచి వెలుపలికి వచ్చారు. అయితే నాలుగు వారాల తర్వాత నవంబర్ 28వ తేదిన సాయంత్రం 5 గంటల్లోపు ఆయన జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
ఈ తరుణంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో లాంఛనాలన్నీ ముగించుకుని చంద్రబాబు (Chandrababu) ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబు కోసం జైలు వద్ద ఉన్న బారీకేడ్లను కూడా తోసుకుని వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో జైలు వద్ద కోలాహలం నెలకొంది. జైలు నుంచి వచ్చిన బాబును చూడగానే టీడీపీ (TDP) శ్రేణుల్లో భావోద్వేగాలు మిన్నంటగా జై చంద్రబాబు నినాదాలు మార్మోగాయి.
జైలు నుంచి వచ్చిన చంద్రబాబుకు మద్దతుదారులు, పార్టీ శ్రేణులు అభివాదాలు తెలిపారు. అచ్చెన్నాయుడుతో బాబు మాట్లాడారు. జైలు నుంచి వచ్చిన చంద్రబాబును టీడీపీ (TDP) నేతలు ఆత్మీయ ఆలింగనం చేేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాబు విడుదలైన నేపథ్యంలో కాన్వాయ్, ఎన్ఎస్జీ బృందం జైలు వద్దకు చేరుకున్నాయి. జైలు నుంచి విడుదలైన బాబు అమరావతి (Amarawati) వెళ్లనున్నట్లు సమాచారం.
మధ్యంతర బెయిల్ (Bail)పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. తన కోసం అందరూ చూపించిన అభిమానం జీవితంలో మర్చిపోలేనని అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ 52 రోజుల పాటు ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారని, ఎంతో మంది పూజలు చేశారని అన్నారు. ఏపీ, తెలంగాణలో రోడ్లపై చేసిన నిరసనలను తానెప్పటికీ మర్చిపోలేనన్నారు. ఎక్కడికక్కడ తాను చేసిన అభివృద్ధిని అందరూ గుర్తించారని, తాను ఏ తప్పు చేయలేదని, చెయ్యనని అన్నారు. ప్రపంచంలోని తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.