»Nara Lokesh Lokeshs Open Letter To Cm Jagan To Support Farmers
Nara Lokesh: రైతులను ఆదుకోవాలంటూ.. సీఎం జగన్కు లోకేశ్ బహిరంగ లేఖ
వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలోని రైతులు అల్లాడిపోతున్నారని నారా లోకేశ్.. ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వరి వేసిన పొలాల్లోనే రైతులు ఉరి వేసుకుంటున్నారని, వాళ్లని రక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితలు నెలకొన్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలోని రైతులు అల్లాడుతున్నారన్నారు. వాళ్లని వెంటనే ఆదుకోవాలని లోకేశ్ కోరారు. పొలాల్లో నీరు లేకపోవడంతో ఎండిన పంటలను చూస్తే గుండె తరుక్కుపోతోందని, ఏ మార్గం లేక రైతులు ఆ పంటలు తగలబెడుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. వరి వేసిన పొలాల్లో రైతులు ఉరి వేసుకుంటున్నారని, వాళ్లని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని లోకేశ్ అన్నారు.
నీరు వదిలి వాళ్ల పంటల్ని కాపాడామని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. నీటి కోసం ఆందోళన చేస్తున్న రైతులే రాష్ట్రమంతా ఎక్కువగా కనిపిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ చివరికి రైతులు లేని రాష్ట్రంలా మారే ప్రమాదం ఉందని లోకేశ్ తెలిపారు. గత వందేళ్లలో రాష్ట్రంలో ఇంత కరువు లేదని, వైసీపీ పాలనలోనే ఇంత తక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని, రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని లోకేశ్ అన్నారు.
ఖరీఫ్ పంటలకే నీరు లేకపోతే ఇక రబీ పంటలు గురించి ఆలోచించకక్కర్లేదని, కొన్ని ప్రాజెక్టులలో నీరు నిల్వ లేదని, నిల్వ ఉన్నవాటిలో పంటలు ఎండిపోతున్నా నీరు వదలరని, ఇలాంటివన్ని అడిగినందుకే చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలులో బంధించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని కోరారు. కరువు మండలాలని గుర్తించి కేంద్రానికి పంపాలని, వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని, పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం తక్షణమే అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.