తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. భూమనకు ఆ పదవి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూమన ఈ బాధ్యతలను… సంక్రాంతి తర్వాత స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే… ఇప్పటి నుంచే ఆయన పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలను జగన్ అప్పగించారు. ఇప్పుడు ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలను పూర్తి స్థాయిలో కట్టబెట్టాలని జగన్ యోచిస్తున్నారు.
ఈ క్రమంలో టీటీడీ బాధ్యతల నుంచి తప్పించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై సుబ్బారెడ్డి ఫోకస్ చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టీడీపీకి కంచుకోటగా ఉండే ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పట్టు సడలకుండా ఉండేందుకు సీనియర్ రాజకీయవేత్త సుబ్బారెడ్డికి పూర్తి బాధ్యతలను జగన్ అప్పగించనున్నారు.