సంపాదించడం గొప్ప కాదు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం గొప్ప అని పలువురు చెబుతుంటారు. అయితే ఇప్పటికే దేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున సంపాదించారు. అయితే వారిలో ఎవరు ఎక్కువగా విరాళం అందిస్తున్నారో ఇప్పుడు చుద్దాం. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం.
Shiv Nadar is top in donations 2023 hurun Philanthropy List
సంపాదించడంలో కాదు. విరాళాలు అందించడంలో కూడా ప్రముఖ పారిశ్రామిక వేత్త అగ్రస్థానంలో నిలిచారు. హెచ్సీఎల్ ఐటీ టెక్నాలజీస్(HCL Technologies) కంపెనీ వ్యవస్థాపకుడు 78 ఏళ్ల శివ్ నాడార్(Shiv Nadar) తన అగ్రస్థానాన్ని మరోసారి నిలుపుకున్నారు. ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ నివేదిక(EdelGive Hurun India Philanthropy List 2023) ఈ వివరాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్జీ రెండో స్థానంలో ఉన్నారు. అదే సమయంలో ముఖేష్ అంబానీ దేశంలో మూడో అతిపెద్ద దాతృత్వవేత్తగా నిలిచారు. ఇక కుమార్ మంగళం బిర్లా, గౌతమ్ అదానీ తర్వాత నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.
అయితే దేశంలోనే అత్యంత సంపన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ కాగా.. తర్వాత బిలియనీర్లలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. శివ్ నాడార్ మాత్రం సంపద పరంగా భారతీయ బిలియనీర్లలో మూడో స్థానంలో నిలిచారు. కానీ దాతృత్వంలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. నివేదిక ప్రకారం శివనాడార్ ఈ ఏడాది రూ.2042 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఐదేళ్లలో నాడార్ మూడోసారి ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచారు. రోజువారీగా చూస్తే ఇది దాదాపు రూ.5.6 కోట్ల విరాళం. దాతృత్వం పరంగా శివ నాడార్ కుటుంబం విద్య, కళలు, సాంస్కృతిక రంగాలపై దృష్టి సారించింది. మరోవైపు రూ.1774 కోట్ల విరాళాలతో అజీమ్ ప్రేమ్ జీ రెండో స్థానంలో ఉన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ రూ.376 కోట్లు, కుమార్ మంగళం బిర్లా రూ.287 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ.285 కోట్లు విరాళంగా ఇవ్వగా.. అదే సమయంలో బజాజ్ కుటుంబం విరాళాల పరంగా ఆరో స్థానానికి చేరుకుంది. వేదాంతకు చెందిన అనిల్ అగర్వాల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్, రోహిణి నీలేకని, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైరస్ అదార్ పూనావాలా టాప్ 10 జాబితాలోని ఇతర ప్రముఖులు.