ఒకప్పుడు కుటుంబం అనడిగితే తాత, నానమ్మ, నాన్న, అమ్మ, పెదనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు… అంటూ గుక్క తిప్పుకోకుండా ఎంతో సంతోషంగా చెప్పేవారు. ఇప్పుడు మాత్రం నేను, నా పార్ట్నర్, పిల్లలు అని కట్ చేసేస్తున్నారు. భారతదేశానికి కుటుంబ వ్యవస్థ ఒక ఆత్మ వంటిది. అలాంటి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలిపోతోంది అనడం కంటే కూలిపోయింది అని చెప్పవచ్చు.
తాత, అమ్మమ్మలు తమ మనవళ్లకు భారతీయ మూలాలను కథల రూపంలో చెప్పడం ద్వారా వారిని సంస్కారవంతంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడేది. రక్త సంబంధం, సహచరత్వానికి తోడు నిస్వార్థం వంటివి మన మన తండ్రి, తాతల వరకు కుటుంబ వ్యవస్థ బలంగా కనిపించింది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పాతతరం కుటుంబ వ్యవస్థ, తాతలు, మిల్లీనియల్స్, జెన్ జెడ్.. ఇలా న్యూ జనరేషన్ చూస్తున్న కుటుంబ వ్యవస్థల్లో ఎప్పటికప్పుడు వేగంగా మార్పు కనిపిస్తోంది. ఒకప్పటివారు తాత, ముత్తాతల పేర్లను టపటపా గుర్తు పెట్టుకునేవారు. ఇప్పుడు సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు దూరం జరిగినా ఈజీగా తీసుకుంటున్నారు. మీ తాత పేరు చెప్పమంటేనే ఆలోచించి, ఫోన్ చేసి అడిగి చెప్పే దుస్థితికి దిగజారిపోయాం.
భారత్కు ఆత్మగా చెప్పుకునే కుటుంబ వ్యవస్థ ఇప్పటికే కేవలం ముగ్గురు, నలుగురి వరకే పరిమితమైంది. ఈ చిన్నపాటి అనుబంధం కలిగిన కుటుంబవ్యవస్థ కూడా కుప్పకూలే అవకాశాలు మరెంతో దూరంలో లేదనేది ఆందోళన కలిగించే అంశమే. కుటుంబంలోని సంబంధాలు, అనుబంధాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతున్నాయి.. మార్పు అనేది మంచి చేయాలి.. కానీ ఇది చెడుకు దారి తీసి, ఆత్మనే దెబ్బతీస్తోంది.
నిన్నటి వరకు ఉన్న ఉమ్మడి కుటుంబాలు కలిసి పని చేసుకునేవి. కష్టం, సుఖం అంతా సమంగా పంచుకునేవారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్న సమయంలో భారతదేశం కుటుంబపరంగా సంపన్నంగా ఉండేది. దాదాపు దేనికీ లోటు లేదు. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ కుప్పకూలడం ప్రారంభించిందో, అప్పటి నుండి అనుబంధం మాత్రమే తెగిపోలేదు… సుఖం, కష్టం, ఇష్టం, అయిష్టం ఎవరికి వారే. ఒకప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే కుటుంబమంతా ఆలోచించి, లాభం చేకూరే నిర్ణయం తీసుకునేది. చెల్లాచెదురైన కుటుంబ వ్యవస్థ కారణంగా ఒంటరి బతుకులో ఆవేశపు సొంత నిర్ణయాలతో రోడ్డున పడుతున్నవారు ఎందరో. కుటుంబ వ్యవస్థ ఆధునిక కాలంలో కాలానుగుణంగా వేగంగా మారుతోంది.
పిల్లలకు అనుబంధాన్ని నూరిపోయాల్సిన చోట డబ్బును, తాత, ముత్తాతల వరకు పంచాల్సిన ప్రేమను ఉన్న కుటుంబానికే పరిమితం చేయడం, విద్యతో పాటు సంస్కారాన్ని అందించే నాటి తరహా విద్యావిధానం లేకపోవడం, తల్లిదండ్రులకు సమయం లేకపోవడం, పిల్లలను ఇంట్లో కంటే హాస్టల్స్, విదేశాలు అంటూ బయటకు పరిమితం చేయడం, ముఖ్యంగా పిల్లలకు గురువు వలె కథల రూపంలో బుద్దిని, తల్లిదండ్రుల వలె ప్రేమను పంచే అమ్మమ్మ, తాతయ్యలకు దూరం చేయడం… ఇలా ఎన్నింటికో నేటి తరం దూరమైంది.
ఇదివరకు కుటుంబంలో కాదు, బంధువుల ఇంట్లో శుభకార్యం ఉన్నా వారం రోజులు గడిపేవారు. కాలాన్ని బట్టి మారాలి. కాబట్టి గతంలో వలె వారం రోజులు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఆ కుటుంబమంతా పది నిమిషాలు హాజరై రావడం మనం చూస్తూనే ఉన్నాం. క్రమంగా పండగకో, పబ్బానికో వెళ్లి, ఇంట్లో వారిని, చుట్టుపక్కల వారిని, బంధువులను మందలించి రావడం కూడా బాగా తగ్గిపోయింది. ప్యామిలీ అంటే ఇప్పుడు తూతూ మంత్రంగా ఇష్టమన్నట్లుగా నడుచుకుంటున్నారు. ఇరవై మందితో కూడిన కుటుంబ వ్యవస్థ నుండి ఇప్పుడు ముగ్గురు నలుగురికి పడిపోయింది. ఇది కూడా ముక్కలయ్యే పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది.
కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి ఎన్నో కారణాలు. ఎవరికి వారు అతి తెలివి ప్రదర్శించడం, చిన్న తప్పులను కూడా భరించలేక, సహనం కోల్పోవడం, అందరూ సమానమనే వింత భావన పెరగడం, పెద్దలు, పిల్లలు కూర్చొని మాట్లాడుకునే సమయం కూడా లేకపోవడం, ఎప్పుడు టీవీ, సినిమాలు, ఓటీటీ, ఇంటర్నెట్, పార్కులు, పబ్బులు అంటూ ఎంటర్టైన్మెంట్కు అలవాటు కావడం, నోటి దురుసుతనం, చీటికి మాటికి తగాదాలు, నీది-నాది అనే భావన రావడం, ఆర్థిక వసరాలు, ఇతరులతో పోల్చుకోవడం, వ్యక్తిగత సుఖాలకు అలవాటు పడటం, బంధాలు, అనుబంధాల గురించి అవగాహన లేకపోవడం.. ఇలా ఎన్నో అంశాలు కుటుంబ వ్యవస్థ కుప్పకూలడానికి కారణాలుగా చెప్పవచ్చు.
నిన్నటి వరకైనా నేను నా భార్య లేదా నా భర్త, పిల్లలు అనేవారు. ఇప్పుడు నేను అనే స్థాయికి శృతిమించింది. పిల్లలకు పెళ్ళి కాగానే వేరుపడతారు. కుటుంబ విలువల్లేవు, కట్టుబాట్లు లేవు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, భార్యభర్తలు మధ్య బలమైన అనుబంధం కొరవడింది. ఇప్పుడు అన్ని బంధాలు కూడా ఆర్థిక సంబంధాలే అయ్యాయి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ కుప్పకూలి ఒక నాటకం నడుస్తోంది. ఈ షో కూడా ఇంకొన్నాళ్లకు కనిపించదు. కుటుంబ వ్యవస్థకు ఉదాహరణ చెప్పాలంటే రామాయణం చెప్పవచ్చు. అన్నదమ్ములు, భార్యభర్తలు, తల్లిదండ్రులు.. చివరకు రాజు ప్రజలు కూడా. ఇది కుటుంబం.. కుటుంబ వ్యవస్థ అంటే.
అందరూ శ్రీరామచంద్రులు, సీతమ్మ తల్లులు కాకపోవచ్చు. కానీ వారి అడుగుజాడల్లో నడవకుండా కుటుంబ వ్యవస్థను కుప్పకూల్చిన వింతజాతి లక్షణాలు వచ్చాయి. కాలానుగుణంగా మార్పు చెందాలని చెప్పవచ్చు. కానీ బంధం, అనుబంధం, స్నేహం, బంధుత్వం అనే సంస్కారం నేర్పే వ్యవస్థ లేనప్పుడు మనిషి మనిషిగా జీవించలేడు. యుగాలుగా మన వద్ద ఈ విలువలు నిలబడడానికి భారతీయత, కుటుంబ వ్యవస్థనే కారణం. ఇప్పుడు అది చెదిరిపోతోంది. ఇప్పటికైనా కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.