తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల(vegetables) ధరలు(rates) చికెన్, మటన్ ధరలతో తెగ పోటీపడుతున్నాయి. అవునండీ మీరు విన్నది నిజమే. ఇంతకుముందు అన్ని కూరగాయల రేట్లు తక్కువగా ఉండేవి. కానీ సమ్మర్ అయి పోయిన తర్వాత వీటి రేట్లు మరింత పైపైకి పోతున్నాయి. వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఓ జిల్లాలో చూసినా కూడా కూరగాయల(vegetables) ధరలు(rates) మండిపోతున్నాయి. రూ.500 తీసుకువెళ్తే 5 రకాల కూరగాయలు కూడా వచ్చేపరిస్థితి కనిపించడం లేదు. 10 రకాలు కొనాలంటే కనీసంగా వెయ్యి రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సిందే. సరే అలా ఐనా సరే..కనీసం వారం రోజులకు కూడా ఆ కూరగాయలు సరిపోవడం లేదు. దీంతో సామాన్యులు కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకూ కూడా ఈ ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి, కాప్సికం, క్యారెట్ సహా… ఇతర కూరగాయలు కిలో 80 రూపాయల నుంచి 120 వరకూ పలుకుతున్నాయి. ఒక్కో చోట రూ.150 వరకు కూడా ఉంది. ఇంకా స్పెషల్ గా వారం రోజుల్లో టమాటా, మిర్చి ధరలు అంమాంతంగా పెరిగిపోయాయి.
ముఖ్యంగా హైదరాబాద్(hyderabad)లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరీ ముఖ్యంగా మిర్చి రేట్ ఘాటెక్కిస్తోంది. ముట్టుకోకుండానే మంటెక్కిస్తోంది. రైతు బజార్ లోనే కిలో 120 రూపాయలు పలుకుతున్న పచ్చిమిర్చి. ఇళ్ల దగ్గర కొట్టుల్లో మాత్రం భయపడేలా చేస్తోంది. ఇక ఒక్కోచోట 150 రూపాయలు కూడా పలుకుతోంది. ఇక టమాటా కూడా కిలో 80 రూపాయలకు తగ్గడం లేదు. ఇవి మాత్రమే కాదు. బీరకాయ, బీన్స్, వంకాయ ఏవి కొనాలన్నా జేబులకు చిల్లులు తప్పడం లేదు. నోరు కట్టేసుకుందామంటే కుదరదు. కనీసం చారు, సాంబారుతో కానిచ్చేద్దామనుకున్నా..ఒక్క టమాటా అయినా వేయకపోతే రుచి పచి ఉండదు. సో సాంబారు నీళ్లకూ కూడా కష్టకాలమొచ్చిందిరా అని జనం అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు రూ.200 పెడితే కూరగాయలతో సంచి నిండిపోయేది. ఇప్పుడు వెజిటబుల్స్‌ను హ్యాండ్ బ్యాగుల్లో సర్దాల్సి వస్తోంది.
ఈ పరిస్థితి హైదరాబాద్ లో మాత్రమే కాదు. ఏపీ(AP)లో కూడా ఇలానే ఉంది. విశాఖలోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నిన్నటి వరకు ఎండలు మండిపోయాయి. ఇప్పుడు కాయగూరల రేట్లు మండిపోతున్నాయి. ఇక అటు మటన్ రూ.1000 టచ్ అవుతుంది. ఇటు చికెన్ రేటు 300 దాటిపోయింది. మొత్తంగా సామాన్యులకు ప్రజంట్ గడ్డు కాలం నడుస్తుంది. బాబోయ్ ఇవేం ధరలు అంటూ ప్రజలు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. ఏంటో.. వచ్చే జీతాలు అన్నీ తినడానికే సరిపోయేటట్లు ఉన్నాయ్. ఇక సేవింగ్స్ గురించి మర్చిపోవడమే.
ఈ రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడమేనని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కర్నాటక(karnataka)లోని బెల్గాం నుంచి పచ్చిమిర్చి, బెంగళూరు(bangalore) నుంచి టమాటా, క్యాప్సికం, క్యారెట్, గుజరాత్(gujarat) నుంచి బంగాళదుంప, కర్నూలు నుంచి క్యారెట్, కొత్తిమీర, కాకర, చిక్కుడు, ఆకుకూరలు, టమాటా, బంగాళదుంప, బీట్రూట్ శంషాబాద్, బోయినపల్లి మార్కెట్లకు దిగుమతి అవుతున్నాయి. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో కూరగాయల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దీంతో అక్కడ ధరలు పెరిగాయి. ఈ ప్రభావం రాష్ట్రంలోని మార్కెట్లపైనా పతనం కావడంతో అధిక ధరలకు కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లలో విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. వాతావరణం అనుకూలించకపోతే కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.