ఆ మధ్యన థండేల్ పెద్ద హిట్టయ్యాక జరిగిన సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్లో కింగ్ నాగార్జున పాల్గొన్నారు స్పెషల్ గెస్ట్ హోదాలో. ఆయన స్టేజి మీదకి వస్తూనే మైక్ పట్టుకుని మొట్టమొదట చెప్పిన మాటేంటంటే…..ఈ మధ్య రోజుల్లో సక్సెస్ మీట్ అన్న మాటే మర్చిపోయాం, సక్సెస్ మీట్ అని వింటుంటే ఎంతో ఆనందంగాఉంది అని. నిజమే అక్కినేని కాంపౌండ్‌లో ఏ ఒక్కరికీ గొప్పగా చెప్పుకునేందుకు గానీ, వాళ్ళ అభిమానులు గర్వంగా మాట్లాడుకోవడానికి గానీ మచ్చుకి ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అన్నదే లేకుండా పోయింది. ఇది చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది.
ఈ ఐస్ థండేల్ సినిమాతో బ్రేక్ అయింది. అక్కినేని క్యాంప్ ఊపిరి పీల్చుకుంది. పైగా థండేల్ అలాటిలాటి హిట్ కాదు. హండ్రెడ్ క్రోర్ క్లబ్‌లోకి చేరిన సినిమా. నాగచైతన్య పేరు ఒక్కసారి మారుమోగిపోయింది. మళ్ళీ సక్సెస్ స్ట్రీక్ స్టార్ట్ అయింది చైకి. చందూ మొండేటి చేసిన వెరైటీ కథ, అందులో చై చేసిన క్యారెక్టర్ అన్నీ బాగా కుదిరాయి. ఓవర్ ఆల్గా సినిమాకి చాలా పెద్ద రిపోర్ట్ వచ్చింది. సాయిపల్లవికి ఉన్న టాప్ ఇమేజ్ అండ్ ఫాలోయింగ్ సినిమాకి బ్రహ్మాండంగా హెల్స్ అవడంతో, చై అండ్ సాయిపల్లవి కాంబో కూడా తెరమీద అద్బుతంగా పండింది. కధా పరమైన నావెల్టీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కి పరుగులు తీయించింది.
తర్వాత నిన్నమొన్న విడుదలైన కుబేర సినిమా ప్రపంచమంతా వినిపించేట్టు విజయఢంకా మోగించింది. కుబేరలో ధనుష్ హీరో అయినప్పటికీ కథ మొత్తం నాగార్జున చుట్టూ తిరగడం, ఆ పాత్రని నాగార్జున తిరుగులేని రీతిలో పోషించడంతో సినిమాకి గొప్ప పునాది బలం దొరికింది. శేఖర్ కమ్ముల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ సమపాళ్ళలో, సరికొత్తగా కుదిరాయి. నాగార్జునే గనక కాకపోతే, ఆ పాత్ర పూర్తిగా ఢీలా పడిపోయిఉండేది. కుబేరకి వీరగా ప్లస్ అయ్యారు నాగార్జున ఆయనకి కూడా ఈ మధ్యరోజులలో ఏమంత చెప్పుకోవలసిన హిట్ పడలేదు. నా సామిరంగా సినిమా సోసో. బ్రేక్ ఈవెన్‌కి రావడమే పెద్ద పండగలా అనిపించేసింది. కానీ కుబేర మళ్ళీ నాగార్జునని మరోసారి నటకుబేరుడిని చేసేసింది.
సుమంత్ కూడా ఈ మధ్య ఓటిటిలో రిలీజైన అనగనగా సినిమాతో గ్రాండ్‌గా నేమ్ అండ్ ఫేంని సంపాదించుకున్నాడు. కొందరు డైరెక్టర్లు ఇప్పుడు సుమంత్‌ని తమ సినిమాల్లో మంచి క్యారెక్టర్‌కి పెట్టుకోవాలనే ఆలోచనకి వచ్చేశారు. అంతకు ముందు కూడా సుమంత్ యాక్ట్ చేసిన సీతారామం భారీ విజయం సాధించడం సుమంత్ కెరీర్ పరంగా గొప్ప హైని తీసుకొచ్చింది. ప్రస్తుతం, ఓ హిట్ కావాల్సిన హీరో అక్కినేని బ్రాండ్‌తో ఉన్నది అక్కినేని అఖిల్ ఒక్కడే. ప్రస్తుతం అఖిల్ లెనిన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అఖిల్‌కి కెరీర్ బిగినింగ్ నుంచీ చూసుకుంటే గనక ఎక్కడా సరియైన స్ట్రాంగ్ బ్రేక్ వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు. తన కష్టం తన పడుతున్నా విజయదేవత మాత్రం కరుణించలేదు. వరించలేదు. అఖిల్‌కి కూడా ఓ హిట్ పడితే లిస్ట్ పూర్తయిపోతుంది, అక్కినేని బ్రాండ్‌కి మళ్ళీ గోల్డెన్ డేస్ మొదలైనట్టే.