తారకరత్న అకాల మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మరణం ఎంతో బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను కోలుకొంటారని భావించానని అన్నారు. నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారని, ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరమన్నారు. తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి మోహనకృష్ణ, బాలకృష్ణకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తారకరత్న మరణం పట్ల జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నందమూరి తారకరత్న మరణం తనను కలిచి వేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని బండి సంజయ్ అన్నారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు విజయసాయి రెడ్డి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నానన్నారు.
ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నామని, కానీ విధి మరోలా తలచిందని బాధపడ్డారు. ఈ మేరకు ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాగా, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న ఆయన శివరాత్రి పర్వదినం రోజున శివైక్యం చెందారు. జనవరి 26వ తేదీన తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండెనొప్పి వచ్చి కుప్ప కూలాడు. అతనిని కుప్పంలో హాస్పిటల్ లో చేర్పించారు. అనంతరం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. 23 రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్ను మూశారు. ఆయన పరిస్థితి ఉదయం నుండే అత్యంత విషమం అని వార్తలు వచ్చాయి. రాత్రికి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి, ఓ కూతురు ఉన్నారు. నందమూరి తారక రామారావు వారసుడిగా ఒకటో నెంబర్ కుర్రాడుతో ఎంట్రీ ఇచ్చారు. ఒకేసారి 9 సినిమాలు ప్రారంభించి రికార్డ్ సృష్టించారు. తారకరత్న హీరోగా దాదాపుగా 20 చిత్రాల్లో నటించారు. పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా కూడా కనిపించారు. 2009లో విడుదల అయిన అమరావతి సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ విలన్గా నంది అవార్డు వచ్చింది. తారకరత్న 2022లో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు. 9 అవర్స్ వెబ్ సిరీస్లో నటించారు. చివరిగా సారధి సినిమాలో నటించారు.