రోజురోజుకు చీటింగ్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన పలువురు యువత ఇంకొంత మందిని మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. దుమ్ముయిగూడకు చెందిన నవీన్ అనే యువకుడు కొంతమందిని చీట్ చేసి సుమారు రూ.5 కోట్ల మేర దోచుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే ఓ మొబైల్ షో రూంలో క్యాషీయర్ గా పనిచేస్తున్న నవీన్ మొదట తన స్నేహితులకు కమిషన్ తీసుకోకుండా క్రెడిట్ స్వైప్ చేసి(Credit card swiping fraud) క్యాష్ ఇచ్చేవాడు. ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ ద్వారా కొంత మంది రావడంతో వారిని కూడా నమ్మించి వారి దగ్గరి నుంచి క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి కమిషన్ తీసుకోకుండా డబ్బులు అప్పగించాడు.
20 మందిని చీట్ చేశాడు!
ఇలా అలవాటు పడిన దాదాపు 20 మంది యువత కమిషన్ లేకుండా నవీన్ దగ్గరి నుంచి డబ్బులు తీసుకుంటూ వేరే వారికి 10 శాతం కమిషన్ చొప్పున ఇచ్చేవారు. ఆ క్రమంలో పలు బ్యాంకుల నుంచి 100కుపైగా క్రెడిట్ కార్డులు తీసుకుని నవీన్ కు పిన్ నంబర్ తో సహా ఇచ్చేశారు. ఈ క్రమంలో ఒకే వ్యక్తి తనకు కోటి రూపాయలు కావాలని అనేక క్రెడిట్ కార్డులు(credit cards) ఇచ్చినట్లు తెలిసింది. ఇలా ఒక్కరి దగ్గరే కోటి రూపాయలు క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేశాడంటే 20 మంది దగ్గర అంచనాకు మించి క్యాష్ దోచుకున్నట్లు తెలుస్తోంది.
స్వైపింగ్ మోసం
ఇక వారి క్రైడిట్ కార్డుల నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వైప్ చేసిన నవీన్.. ఎక్కువ మొత్తం కాబట్టి కాస్తా సమయం కావాలని వారికి తెలిపాడు. ముందుగానే నవీన్‌ను నమ్మిన యువకులకు షాక్ ఎదురైంది. వారం, రెండు వారాలు గడిచినా కూడా నవీన్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. నవీన్ గురించి పూర్తి అడ్రస్, సమాచారం లేకుండానే అతనికి 100కు పైగా కార్డులు అప్పజెప్పారు. అనేక రోజులు వేచి చూసినా కూడా ఇక ఉపయోగం లేకుండా పోయింది.
చివరకు కంప్లైంట్
ఇదే క్రమంలో వీరి కార్డుల నుంచి స్వైప్ చేసిన నగదు కట్టాలని వారికి ఆయా బ్యాంకుల నుంచి మేసేజ్ లు రావడం మొదలయ్యాయి. ఇంకొన్ని రోజులు గడిచినా కూడా నవీన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అతనికి ఫోన్ చేస్తే కలవడం లేదు. ఇక మోసపోయామని భావించిన యువకులు చివరకు హైదరాబాద్(Hyderabad) సైబర్ క్రైం(cyber crime), సీసీఎస్ పోలీసులకు(ccs police) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు నవీన్ పనిచేసిన మొబైల్ షో రూం సహా అతని స్నేహితులను నవీన్ వివరాల గురించి తెలుసుకుంటున్నారు. మరోవైపు పక్కా ప్లాన్ ప్రకారమే నవీన్ పెద్ద ఎత్తున దోపిడీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అత్యాశకు పోయి యువకులు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.