రాబోయే వాలంటైన్స్ డేను బహిష్కరించాలని విశ్వహిందు పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. లవర్స్ డేను బహిష్కరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించాయి. వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దామని వీహెచ్పీ జనరల్ సెక్రటరీ పండరినాథ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జవాన్ల గుర్తుగా జరపాలని వీహెచ్పీ నిర్ణయించింది. ప్రజలంతా అమర జవాన్లకు నివాళులు అర్పించాలి. దేశం కోసం పని చేస్తున్న వీర జవాన్లను స్మరించుకోవాలి.
ఎవరైనా వాలంటైన్స్ డే జరుపుకొంటే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చారించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా ప్రేమికుల దినోత్సవాన్ని నిషేధిస్తున్నాం. పబ్బులు, హోటళ్లు, పార్కులలో ఎవరైనా ప్రేమికుల రోజు కనిపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా గ్రీటింగ్ కార్డుల దహనం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 14న అమర జవాన్లను స్మరించుకుని నివాళులు అర్పిద్దాం. దేశభక్తిని చాటుదాం’’అని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరామ్ అన్నారు