Sonia Gandhi : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ శనివారం ఎన్నికయ్యారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగ్గా సోనియాగాంధీ మళ్లీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా, గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, కె సుధాకరన్ ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు.
77 ఏళ్ల సోనియా గాంధీ ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతకుముందు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు తీసుకోవాలని ఏకగ్రీవంగా కోరింది. “అతి త్వరలో” దానిపై నిర్ణయం తీసుకుంటానని పార్టీ అగ్ర నేతలకు ఆయన చెప్పారు.
చాలా మంది మాకు సంతాప సందేశాలు రాశారు: సోనియా
పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికైన తర్వాత సోనియా గాంధీ ప్రసంగిస్తూ.. ‘చాలా మంది మాకు సంతాప సందేశాలు రాశారని, అయితే మల్లికార్జున్ ఖర్గే దృఢమైన నాయకత్వంలో మేము అండగా ఉన్నామని చెప్పారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర నిజంగా చారిత్రాత్మక ఉద్యమాలు. ఇవి మా పార్టీని అన్ని స్థాయిలలో పునరుజ్జీవింపజేశాయి. అపూర్వమైన వ్యక్తిగత, రాజకీయ దాడులను ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ తన మొండితనానికి, సంకల్పానికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని సోనియా అన్నారు.