Kerala : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు కేరళలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ చర్యలు చేపట్టింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ, ఆమెకు చెందిన ఐటీ కంపెనీతో పాటు ఇతరులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఓ అధికారి వెల్లడించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి వీణకు చెందిన కంపెనీపై కేసు నమోదు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి.
ఓ మైనింగ్ సంస్థతో అక్రమ లావాదేవీలు జరిపినట్లు సీఎం విజయన్ కుమార్తె వీణపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఎస్ఎఫ్ఐఓ ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం విషయం ఆదాయపు పన్ను శాఖ విచారణలో వెలుగు చూసింది. కొచ్చిన్ మినరల్స్ రూటిల్ లిమిటెడ్ 2018-19 మధ్య కాలంలో వీణా కంపెనీ ఎక్సాలాజిక్స్ సొల్యూషన్స్‌కు రూ. 1.72 కోట్లు చెల్లించిందని, ఆ సమయంలో ఈ ఐటీ సంస్థ ఎలాంటి సేవలను అందించలేదని దర్యాప్తులో తేలింది. కాగా, సీఎం పినరయి కుమార్తెపై నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో, దర్యాప్తు సంస్థ చర్యపై సీపీఎం ఇప్పటికే ప్రశ్నలు సంధిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు వీణా కంపెనీపై కేంద్ర దర్యాప్తు చేపట్టిన ఈ చర్య రాజకీయ ప్రేరేపితమని సీపీఐ (ఎం) గతంలో కూడా పేర్కొంది.