నేడు వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదువుల తల్లి సరస్వతి దేవిని స్తుతించే పవిత్రదినం కావడంతో బాసరలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. తెల్లవారుజాము నుంచే పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు జరిపించడానికి వేలాదిగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో 300 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.