ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. కట్నం తీసుకొని రావాలని వేధించగా.. తమ్ముని వద్దకు వెళ్లింది. ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి.. వచ్చిన తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. ఆవేశంలో చేయి చేసుకొని హతమార్చాడు.
Husband Killed Wife: హైదరాబాద్ నగర నడిబొడ్డున దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త (Husband) కాలయముడిగా మారాడు. ఇల్లు ఖాళీ చేస్తున్నానని.. సామాను తీసుకెళ్లాలని భార్యకు సమాచారం ఇచ్చాడు. నిజమే అనుకొని ఒంటరిగా వెళ్లింది. రాగానే గొడవ పడి.. దారుణంగా హత్య చేశాడు. నేరేడ్మెట్లో ఈ ఘటన జరిగింది.
వరంగల్ జిల్లా గన్నారంకు చెందిన స్రవంతి.. సిద్దిపేట జిల్లి శ్రీగిరి పల్లికి చెందిన మహేందర్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి మరీ 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. పెళ్లైన తర్వాత ఆర్థిక కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఇంకేముంది భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చాయి. కట్నం తీసుకొని రావాలని స్రవంతిని నిత్యం వేధించేవాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగేది. లాభం లేదనుకుని.. కూతురిని తీసుకొని తన తమ్ముడి ఇంటికి వెళ్లిపోయింది స్రవంతి.
అప్పటినుంచి మహేందర్ ఒక్కటే ఉంటున్నాడు. ఇల్లు ఖాళీ చేస్తున్నానని.. వస్తువులు తీసుకొని వెళ్లాలని స్రవంతికి ఫోన్ చేశాడు. నిజమే అనుకొని.. ఒంటరిగా వెళ్లింది. సమయం కోసం చూసిన మహేందర్.. భార్యతో ఏదో ఒక విషయంలో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన మహేందర్ భార్యను కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయాడు. వస్తువుల కోసం వెళ్లిన సోదరి ఇంకా రాకపోవడంతో తమ్మునికి అనుమానం వచ్చింది. ఇంటికి వచ్చి చూద్దాం అని వచ్చాడు. రాగా బయట తాళం ఉంది. దీంతో అతని సందేహాం మరింత బలపడింది.
ఎలాగైనా సరే అని తాళం బద్దలు కొట్టాడు. తలుపు తీసి చూడగా తన అక్క విగతజీవిగా పడి ఉంది. దీంతో అతని రోదనలతో చుట్టుపక్కల వారు వచ్చి గుమిగూడారు. తన సోదరిని మహేందర్ హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. మహేందర్‌కు కఠిన శిక్ష విధించాలని స్రవంతి సోదరుడు డిమాండ్ చేశాడు.