Food poisoning: ఫుడ్ పాయిజన్ 50 మందికి అస్వస్థత..పేరెంట్స్ ఆగ్రహం
రాష్ట్రంలో వరుసగా పలు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న నాగర్ కర్నూల్, తర్వాత నల్గొండ జిల్లాలో జరుగగా..తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫుడ్ పాయిజన్ అంశం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 50 మందికిపైగా విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు.
తెలంగాణలో మరో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అంశం బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో 50 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల బీసీ బాలికల హాస్టల్లో చోటుచేసుకుంది. విద్యార్థినులు ఆకస్మాత్తుగా వాంతులు, విరేచనాలతో కుప్పకూలడంతో గమనించిన అధికారులు వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అయితే అసలు ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిందనే విషయం తెలియాల్సి ఉంది.
మరోవైపు నిన్న నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఆశ్రమ పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ క్రమంలో 200 మంది విద్యార్థినులు అక్కడ ఉండగా..వారిలో 170 మంది అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. రాత్రి 7 గంటలకు వారు వాంతులు, విరేచనాలు కడుపునొప్పితో బాధపడ్డారని విద్యార్థినులు చెప్పారు. అంతేకాదు నల్గొండ జిల్లా మిర్యాలగూడ బాలికల వసతి గృహాంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ సంఘటనలో దాదాపు 10 మంది అనారోగ్యం బారిన పడగా..వారిని ఆస్పత్రిలో చేర్పించారు. వారిని స్థానిక నేతలు వచ్చి పరామర్శించారు.
ఈ క్రమంలో ఆయా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అంశంపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నాణ్యత కల్గిన ఆహారం విద్యార్థినులకు అందించడం లేదని వాపోతున్నారు. ఈ అంశంపై అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతోపాటు హాస్టళ్లో విద్యార్థులకు ఏదైనా వ్యాధులు వచ్చినా కూడా పట్టించుకునే అధికారులు ఉండటం లేదంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ అంశంపై అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాయి.