BRS MLA: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహా బ్యారక్‌లో ఊచలు లెక్కబెడుతున్నాడు. అతని అరెస్ట్‌ను నిరసిస్తూ పలు చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే గాక తెలంగాణలో కూడా ర్యాలీలు జరుగుతున్నాయి. వనస్థలిపురంలో చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ తీశారు. చాలా మంది చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ర్యాలీలో ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఇతర పార్టీలకు చెందిన నేతలు/ ప్రజా ప్రతినిధులు దూరంగా ఉంటారు. బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. టీడీపీ అభిమానులకు సంఘీభావం తెలిపారు. వీరిద్దరూ పాల్గొనడం చర్చకు దారితీసింది.
పనామా సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వివాదం జరిగింది. నల్ల జెండాలు, ప్లకార్డులతో అభిమానులు గొంతెత్తి నినదించారు. స్కిల్ స్కామ్‌లో 14 రోజుల రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. ఆయనను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోంది.