»Indian Women Who Defeated England The Biggest Victory In Test Cricket
INDw vs ENGw: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత మహిళలు..టెస్ట్ క్రికెట్లో అతి పెద్ద విజయం
ఇంగ్లండ్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు 347 పరుగుల తేడాతో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. అన్ని రంగాల్లోనూ భారత మహిళలు అద్భుత ప్రతిభను కనబరిచారు.
భారత గడ్డపై మహిళ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇంగ్లండ్ జట్టుతో ఏకైక టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయాన్ని సాధించి రికార్డు నెలకొల్పింది. సొంతగడ్డపై అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చింది. ఇంగ్లండ్ జట్టును మూడు రోజుల్లోనే మట్టికరిపించింది. టెస్ట్ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
India Women have defeated England Women in the Test match by 347 runs 🔥🔥
తొలి ఇన్నింగ్స్‌లో భారత మహిళల జట్టు 428 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో శుభా సతీశ్ 69, జెమీమా రోడ్రిగ్స్ 68, యస్తికా భాటియా 66, దీప్తి శర్మ 67 పరుగులు చేసి అర్ధసెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 49, స్నేహ్ రాణా 30 పరుగులతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 136 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్నర్ దీప్తి శర్మ 5 వికెట్లు తీసింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత మహిళల జట్టు 6 వికెట్లకు 186 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు 479 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ మహిళల జట్టు 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీప్తి శర్మ ఆ ఇన్నింగ్స్‌లో కూడా 4 వికెట్లు తీయడం విశేషం. దీంతో భారత మహిళల జట్టు ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్ మహిళల జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది.