చదువుల తల్లి సరస్వతి మాతపై వివాదాస్పద రెంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలు హిందువుల ఆగ్రహానికి గురయ్యాయి. ఈ దేశంలో హిందువులను, హిందూ దేవతలను విమర్శించడమే లౌకికవాదంగా మారిందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. లౌకికవాదం ముసుగులో కొంతమంది హిందుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని, అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. చదువుల తల్లి సరస్వతి మాత పైన రెంజర్ల రాజేష్ తప్పుడు ప్రచారం చేసినందుకు గాను దీనిని నిరసిస్తూ నిర్మల్ జిల్లా బాసరలో గ్రామస్థులు మంగళవారం స్వచ్చంధ బంద్‌ను నిర్వహించారు. ఉదయం నుండి స్వచ్చంధంగా వ్యాపార సముదాయాలను, దుకాణాలను, పాఠశాలలను మూసివేసి బంద్ నిర్వహించారు.
గ్రామస్థులు రోడ్ల పైన బైఠాయించి రెంజర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేష్ పైన చర్యలు తీసుకోకుంటే నిరసనలను ఉధృతం చేస్తామన్నారు. అతనిపై పీడీయాక్ట్ పెట్టాలన్నారు. ఈ సందర్భంగా రెంజర్ల రాజేష్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి, దగ్ధం చేశారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వ్యాపారులు, విద్యార్థులు, స్థానికులు ఎక్కడికి అక్కడే రోడ్డు పైన బైఠాయించారు. హిందువు అయినా రాజాసింగ్ పట్ల ఒక వైఖరి, ఇతరుల పట్ల మరో వైఖరి ఏమిటని ప్రశ్నించారు.