CTR: నాగలాపురానికి చెందిన విలేకరి రాహుల్ గురువారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగలాపురం నుంచి స్వగ్రామం సురుటుపల్లికి బైక్‌పై వెళుతుండగా బయటకొడియంబేడు వే బ్రిడ్జ్ వద్ద బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాహుల్‌కు తలపై, కుడి భుజం ఎముకకు తీవ్ర గాయాలు, ముఖం చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు.
TPT: తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జరగనున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు. గురువారం ఆమె కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అమ్మబడి కార్యక్రమం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. గర్భిణులకు వైద్య, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రక్తహీనత లేకుండా గర్భిణులు జాగ్రత్త పడాలన్నారు. పౌష్టికారం తీసుకోవాలని గర్భిణులకు సూచించారు.
MBNR: అక్టోబర్ 30న కేంద్రంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమానికి దిగిన కేసులో 18 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గురువారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో బెయిల్ లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అప్పట్లో కేసు నమోదు చేయడం జరిగిందని, తాము ఆ రోజున న్యాయమైన పోరాటమే చేశామని తెలిపారు.
MBNR: రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ డయాగ్నస్టిక్ సెంటర్ కోసం భూమి కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని గురువారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆపత్కాలంలో సేవలు అందిస్తుందన్నారు.
KMR: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పల్వంచ వర్కింగ్ ప్రెసిడెంట్ మజహార్ షరీఫ్ గురువారం సూచించారు. ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలోని యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఉపాధి పొందాలన్నారు.
TPT: ప్రముఖ ప్రైవేట్ కంపెనీ DMW – CSR నిధుల కింద అందించిన 3 లక్షల రూపాయులతో 10 కంప్యూటర్ లను SKR ప్రభుత్వ జూనియర్ కాలేజ్ యాజమాన్యంకు గూడూరు ఎమ్మెల్యే పీ.సునీల్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేయడం జరుగుతుందని ఇందులో భాగంగా ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా ఈ కంప్యూటర్లను అందించామన్నారు.
KRNL: ఆదోని పట్టణంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి చల్లటి గాలులు వీయగా మధ్యాహ్నం ఒక్కసారిగా మోస్తరు వర్షం కురిసింది. మూడు రోజులుగా ఎండ తాపానికి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. మరోవైపు రాబోయే మూడు రోజులు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ASR: పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా 36వ రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీని కలెక్టర్ దినేశ్ కుమార్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రారంభించారు. గురువారం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి 72 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని తెలిపారు.
GNTR: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి వచ్చింది. రూ.25 లక్షల వ్యయంతో ఆధునీకరించిన ఈ స్విమ్మింగ్ పూల్‌ను గురువారం ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ షేక్ సజీల ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
VZM: నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద గల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో గురువారం జరిగిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్‌ను ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, రక్షణ చర్యలు చేపట్టడానికి ఫైరింగ్ ప్రాక్టీస్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి మున్సిపాలిటీ వైసీపీ ఉపాధ్యక్షుడిగా రంగస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన రంగస్వామి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
ATP: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఓబులేసుకు అందజేశారు.
VZM: జామి మండలం లొట్లపల్లి సచివాలయాన్ని ఎంపీడీవో అప్పలనాయుడు గురువారం సందర్శించారు. ముందుగా ఆయన సచివాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న వర్క్ ఫ్రం హోం తదితర సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.