టమాటా ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒక్కోసారి సెంచరీకి చేరే కిలో టమోటా రేటు..ఇప్పుడు ఒక్కసారిగా ఢమాల్ మంది. ఎప్పుడు ఏ ధర ఉంటుందో అర్థంకాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. టమాటా ధరలు తీవ్రంగా పడిపోయాయి. కిలో 3 నుంచి 4 రూపాయలే పలుకుతోన్న ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రైతులు ఆందోళనలో ఉన్నారు. కూలీలు, రవాణా ఖర్చులు సైతం రాక రైతులు దిగాలుపడతున్న స్థితి ఆందోళనకరంగా మారింది. ధర పతనం దారుణంగా అవడంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వ్యాపారస్తులు.. దళారులు కుమ్మక్కై రేటు రాకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వమే చొరవ చూపి రైతులను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు. సరైనా ధర లేకపోవడంతో టమాటాలను పశువులకు మేతగా వేస్తున్నారు. టమాటా సాగు చేసిన రైతులందరిదీ ఇదే దుస్థితి. ఏ రైతును కదలించినా.. సరైన ధర కల్పించడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.. సాగుచేసిన టమాటా పంట రోడ్డు పాలైంది. కాలం కలిసి రావడంతో కొంత మేరకు ఆశించిన దిగుబడులు వచ్చాయనుకుంటే, ధర తగ్గిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు రైతులు.