»Those Who Do Not Care For Their Parents Have No Property Madras High Courts Sensational Verdict
High Court: తల్లిదండ్రులను పట్టించుకోని వారికి ఆస్తి లేదు..మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు
తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. పేరెంట్స్‌ను పట్టించుకోని వారు చట్టప్రకారం ఆస్తిని వారి తల్లిదండ్రులకు ఇచ్చేయాలని కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
తల్లిదండ్రులను పట్టించుకోకుండా చాలా మంది వదిలేస్తున్నారు. కొందర్ని అనాధాశ్రమాల్లో చేర్చుతున్నారు. మరికొందరిని మానసికంగా హింసిస్తున్నారు. అలాంటి వారికి మద్రాస్ హైకోర్ట్ (Madras High Court) షాకిచ్చింది. తల్లిదండ్రులు తమ ఆస్తులను పిల్లలకు రాసిచ్చిన తర్వాత వారు పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉందని సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ ఎస్ ఎం సుబ్రహ్మణ్యం ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.
పిల్లలకు ప్రేమ, ఆత్మీయతలతో ఆస్తిని ఇస్తున్నట్లు సెటిల్మెంట్ దస్తావేజులో తల్లిదండ్రులు పేర్కొంటే అది తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టంలోని నిబంధనల కిందికి వస్తుందని జస్టిస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వారికి కూడా పిల్లల నుంచి ప్రేమ, ఆత్మీయతలు అందాలన్నారు. ఒకవేళ ప్రతిఫలాన్ని ఇవ్వడంలో పిల్లలు ఉల్లంఘనలకు పాల్పడితే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
వృద్ధులు లేదా తల్లిదండ్రులను చూసుకోకపోవడం, వారికి భద్రత కల్పించకపోవడం, వారి గౌరవాన్ని కాపాడకపోవడం వంటివి జరిగినప్పుడు ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. షకీరా బేగం తన కొడుకు మహమ్మద్ దయాన్ పేరు మీద ఆస్తిని రాసింది. అయితే కుమారుడు తన బాగోగులను పట్టించుకోలేదు. దీంతో ఆమె తిరుప్పూర్ సబ్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసింది.
తాను రాసిన సెటిల్మెంట్ డీడ్‌ను రద్దు చేయాలని కోరడంతో సబ్ రిజిస్ట్రార్ దానిని రద్దు చేశారు. అయితే మహమ్మద్ దయాన్ తన తల్లి కేసును సవాల్ చేస్తూ కోర్టుకెక్కడంతో దయాన్ వాదనలను జస్టిస్ సుబ్రహ్మణ్యం తోసిపుచ్చారు. చట్టం ప్రకారం ఆస్తులను తన తల్లిదండ్రులకు ఇచ్చేయాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.