తమిళనాడు పేరు గురించి గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీంతో గవర్నర్ రవి బుధవారం వివరణ ఇచ్చారు. తమిళనాడుకు వ్యతిరేకిని కాదని ఆయన స్పష్టంచేశారు. తమిళనాడు పేరు మార్చాలని సూచించిన వార్తలు అవాస్తవం అన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. కాశీకి, తమిళులకు చారిత్రకంగా, సాంస్కృతికంగా అనుబంధం ఉందన్నారు. అందుకోసమే తమిళగం అనే పదాన్ని వాడానని తెలిపారు. చారిత్రక సందర్భంలో ‘తమిళగం’ పదం కరెక్ట్ అని చెప్పేందుకు ప్రయత్నించానన్నారు.
తమిళనాడు అంటే తమిళుల దేశం అని, తమిళగం అంటే తమిళుల ఇల్లు అని వివరించారు. దేశం మొత్తానికి వర్తించేది తమిళనాడు కాదని, కాకపోతే అది అలవాటుగా మారిందన్నారు. చారిత్రక సాంస్కృతి సందర్భంలో తమిళగం పదం వాడానన్నారు. తమిళనాడు పేరు మార్చమని సూచించినట్టు కాదన్నారు. తన ప్రసంగంలో ఉద్దేశం పరిగణనలోకి తీసుకోలేరని చెప్పారు. తమిళనాడు అనే పదానికి వ్యతిరేకినని ప్రచారం చేస్తున్నారని, అందుకే వివరణ ఇస్తున్నానని తెలిపారు.
దేశం మొత్తం ఒక విధానం అనుసరిస్తే, వ్యతిరేకించడం తమిళనాడుకు అలవాటు అయ్యిందని ఇటీవల గవర్నర్ ఆర్ఎన్ రవి కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ప్రసంగ సమయంలో తమిళనాడు అనే పదం ఉన్న చోట తమిళగం అనే పేరును గవర్నర్ పలికారు. తమిళ నేతల పేర్లు ఉన్న పేరాలను విడిచిపెట్టడంతో దుమారం రేపింది. గవర్నర్కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టడం, కొందరు ఎమ్మెల్యేలు క్విట్ తమిళనాడు అంటూ నినాదాలు చేశారు. డీఎంకే, దాని మిత్రపక్షం బీజేపీ, అన్నాడీఎంకే, ఇతర పార్టీలు గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యాఖ్యలపై మండిపడ్డాయి. గవర్నర్కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వివరణతో వివాదానికి తెరదింపే ప్రయత్నం చేశారు.