జమ్ము కశ్మీర్(Jammu and Kashmir)లో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీ శ్రీనగర్‌లోని నైజీన్ సరుస్సులో బోటు షికారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇది కేవలం కుటుంబ పర్యటన మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ కూడా ప్రస్తుతం శ్రీనగర్‌లోనే ఉన్నారు. ఇటీవల లద్దాఖ్‌లో పర్యటించిన ఆయన.. శుక్రవారం ఉదయం కార్గిల్‌లో బహిరంగ ర్యాలీని పూర్తి చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. మరోవైపు ఆయన సోదరి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి శ్రీనగర్‌కు చేరుకోనున్నారు.
వీరంతా రెండు రోజుల పాటు శ్రీనగర్‌లో గడిపి అక్కడి నుంచి గుల్మార్గ్కు వెళతారు. గత కొన్నేళ్లుగా శ్రీనగర్‌లోని ‘రైన్‌వారి’ ప్రాంతంలోని ఓ హోటల్లో రెండు రాత్రులు నిద్ర చేయడం ఈ కుటుంబానికి సెంటిమెంట్‌గా వస్తోంది. అయితే, ఈ సారి రాహుల్ నైజీన్ సరస్సులోని బోట్ హౌస్‌లో ఉంటారని సమాచారం. మిగతా కుటుంబ సభ్యులు మాత్రం వారి సెంట్మెంట్ మేరకు పాత హోటల్లోనే బస చేయనున్నారు. 2019లో కేంద్ర పాలిత ప్రాంతం హోదా పొందిన తర్వాత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన తొలి పర్యటన నిమిత్తం ఆగస్టు 2న లడఖ్ చేరుకున్నారు.
గతంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కూడా ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదాను రద్దు చేయడంతో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చబడింది. కాగా రాహుల్ వారం క్రితం ఢిల్లీ (Delhi) నుంచి తన కెటిఎమ్ బైక్ పై లడఖ్ వరకు చేరుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన మోటార్‌సైకిల్‌పై పాంగాంగ్ (Pangong) సరస్సు, నుబ్రా లోయ, ఖర్దుంగ్లా టాప్, లమయూరు జన్స్కార్తో సహా ప్రాంతంలోని అన్ని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించారు.