మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(satya nadella) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. భారత్ కి చెందిన ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి అందుకోవడం దేశానికే గర్వకారణం. కాగా.. ఆయన తాజాగా భారత ప్రతిష్టాత్మక పురస్కారం పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా సత్య నాదెళ్లకు ఈ పురస్కారం ప్రకటరించారు.
ఢిల్లీ వేదికగా జరిగిన పద్మ అవార్డుల పురస్కార ప్రధానోత్సవానికి సత్య నాదెళ్ల హాజరు కాలేదు. దీంతో, ఆయనకు అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ ఈ అవార్డును బహూకరించారు. భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టివి నాగేంద్ర ప్రసాద్ నుంచి సత్య నాదెళ్ల ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మభూషణ్ అవార్డును అందుకోవడం ద్వారా ఎంతో మంతి అసాధారణ వ్యక్తలతో పాటుగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని సత్య నాదెళ్ల చెప్పారు.
ప్రధాని మోదీతో పాటుగా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో భారతదేశాన్ని సందర్శించాలని యోచిస్తున్నట్లు సత్య నాదెళ్ల వెల్లడించారు. సాంకేతికత ద్వారా అభివృద్ధి సాధనలో భారత ప్రజలతో కలిసి పని చేయాలాని తాను నిరీక్షిస్తున్నట్లు చెప్పారు. భారత్ లో నెలకొల్పుతున్న పరిశ్రమలు..సంస్థలు ఇప్పుడు సాంకేతికత దిశగా మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితిలో మరింతగా మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక, ఈ అవార్డు తీసుకున్న తరువాత తమ సీఈఓ భారత్ ను సందర్శించాలనే ఆలోచనలో ఉన్నారని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.