గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి(Morbi bridge) కూలిన ఘటనను తలుచుకుని ప్రధాని మోడీ(PM Modi) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇప్పటి వరకు ఇంతటి బాధను ఎప్పుడూ అనుభవించలేదన్నారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే తన హృదయం తల్లడిల్లి పోయిందన్నారు. ఇది ఇలా వుంటే ఆయన కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని రేపు సందర్శించనున్నారు. ఈ మేరకు విషయాన్ని గుజరాత్ సీఎంవో వెల్లడించింది. ఇప్పటికే ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.
మరోవైపు గుజరాత్ ప్రభుత్వం కూడా మరణించిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000ల చొప్పున చెల్లించనున్నట్టు పేర్కొంది. కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సుమారు 140 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. వంతెన కూలిన ఘటనపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేశామని రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ కూడా విచారణ చేస్తోందన్నారు.