Cyclone Alert: మిచాంగ్ తుఫాను కారణంగా తమిళనాడు రాజధాని చెన్నైతో సహా అనేక నగరాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఎటు చూసిన నీరే కనిపిస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు ఉండడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిచాంగ్ తుపాన్ కారణంగా రెండ్రోజుల పాటు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. సైక్లోన్ కారణంగా ప్రజలకు అన్ని విధాల సాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తుపానుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్, రోడ్లపై ఎక్కడ చూసినా ఆకాశం చిల్లుపడిందా అన్నట్లు అనిపిస్తోంది. ఈ విపత్తు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.
ఎయిర్ పోర్టు అంతా నీటితో నిండిపోయింది. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా చాలా విమానాలు రద్దు చేయబడ్డాయి. ఎయిర్పోర్టు లోపల ఈ దృశ్యాన్ని చూస్తుంటే వర్షం వేగం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. లోపల పార్క్ చేసిన బస్సులు నీటిలో ఉండగా, విమానం చక్రాలు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు, బలమైన గాలులు వీస్తున్న అనేక వీడియోలు కూడా బయటపడ్డాయి. వాటిని చూసిన తర్వాత ఖచ్చితంగా భయపడతారు. గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో చెట్లు కూడా విపరీతంగా ఊగిపోతున్నాయి. మరోవైపు చెన్నైలోని లోతట్టు ప్రాంతాలతో పాటు నగరంలోని పాష్ కాలనీలు కూడా అధ్వానంగా మారాయి. భవనం చుట్టూ నీరు కనిపిస్తోంది. పక్కనే పార్క్ చేసిన కార్లన్నీ నీటిలో ఆకుల్లా తేలుతూ ఒకదానికొకటి ఢీకొంటున్నాయి.
వర్షం కారణంగా రోడ్లపై నీరు నదిలా ప్రవహిస్తోంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. నడవడానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వర్షం నీరు చేరిన పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఉంచిన వస్తువులన్నీ నీటిలో తడిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూర్చోవడానికి, నిలబడేందుకు కూడా స్థలం దొరకడం లేదు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ అలర్ట్గా ఉంది. అనేక NDRF బృందాలను మోహరించారు, ఇవి ప్రజలకు సహాయం చేస్తున్నాయి. సున్నిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం విపత్తు సిబ్బందిని నియమించింది. అంతేకాకుండా ప్రజల కోసం సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, చెన్నై వాతావరణ శాస్త్రం ప్రకారం, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో ప్రత్యేక హెచ్చరిక జారీ చేయబడింది. అలాగే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నారు. బాధిత రాష్ట్రాలకు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.