»Assam A Strange Village Where Birds Commit Suicide Where Is It
Assam : పక్షులు ఆత్మహత్య చేసుకునే వింత గ్రామం..ఎక్కడంటే?
ఆగస్ట్, నవంబర్ నెలలు వచ్చాయంటే చాలు ఆ ఊర్లో అనేక జాతుల పక్షులు చచ్చిపోతుంటాయి. చాలా పక్షులు బలవన్మరణానికి పాల్పడుతుంటాయి. ఇప్పటికీ ఈ వింత ఓ గ్రామంలో చోటుచేసుకుంటూనే ఉంది. ఆ మిస్టరీని ఇప్పటికీ ఎవ్వరూ బయటపెట్టలేకపోయారు.
అస్సాంలోని జాతింగా అనే గ్రామంలో రాత్రి అయితే చాలు అక్కడికి ఎవ్వరూ వెళ్లరు. రాత్రి తర్వాత ఆ గ్రామంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఇతర గ్రామాలతో ఆ ఊరికి సంబంధం లేదు. గత 9 నెలల నుంచి ఆ గ్రామంతో ఇతర ఊర్లు కలవడం లేదు. సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆ గ్రామంలో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో పక్షులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. అక్కడికొచ్చే పక్షులన్నీ కూడా ఇళ్లను, చెట్లను ఢీకొట్టుకుంటూ సూసైడ్ చేసుకుని చనిపోతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. గ్రామంలో ఆగస్టు, నవంబర్ నెల వస్తే చాలు పక్షులు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువవుతోంది.
గ్రామానికి అనేక జాతుల పక్షులు వస్తాయి. ఇవే కాకుండా విదేశీ పక్షులు కూడా అక్కడికి చేరుకుని ఆత్మహత్య చేసుకుంటాయి. పక్షులు సూసైడ్ చేసుకోవడం వెనక ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అయితే ఆ ప్రాంతంలో అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుందని, దానికి తోడు పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో వేగంగా గాలులు వీయడం వల్ల పక్షులన్నీ ఆ గాలికి అక్కడున్న ఇళ్లను ఢీకొట్టుకుని చనిపోతున్నట్లుగా పరిశోధకులు చెబుతున్నారు.
చీకటి సమయంలో అక్కడున్న పరిసరాలన్నీ కూడా కనిపించకపోవడం వల్ల అక్కడికి వస్తున్న పక్షులన్నీ ఢీకొట్టుకుని చనిపోతున్నట్లు శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే గ్రామస్తులు మాత్రం రకరకాలుగా కథలు చెప్పుకుంటున్నారు. ఆ గ్రామంలో ఏదో దుష్టశక్తి ఉందని, అది పక్షులను బతకనివ్వడం లేదని గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. ఆ దుష్టశక్తి నుంచి తప్పించుకోవడం కోసం ప్రతి ఇంటి ముందూ అందరూ వెదురు కర్రలను పాతిపెట్టారు. అయితే వాతావరణ పరిస్థితుల వల్లే అవి చనిపోతున్నాయా? లేకుంటే అసలు కారణం ఏంటని శాస్త్రవేత్తలు ఇంకా ఆ ప్రాంతంలో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఆ ప్రాంతాన్ని సూసైడ్ పాయింట్ ఆఫ్ బర్డ్స్ గా చెప్పుకుంటున్నారు.