బుల్లి తెరను ఏలుతున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై ఈ రేంజ్లో హిట్ కొడతాడని ఎవరు ఊహించి ఉండరు. మాస్ కంటెంట్‌తో ‘గాలోడు’గా నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుధీర్. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు అతని క్రేజ్‌తో గాలోడు మంచి వసూళ్లు రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున కోటికి పైగా వసూళ్లు రాబట్టగా.. రెండో రోజున 96 లక్షలు.. మూడో రోజున కోటిన్నర గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా మూడు రోజుల్లో సుమారు 4 కోట్ల గ్రాస్ రాబట్టిందని అన్నారు. అయితే వీకెండ్ కావడంతో సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. కానీ ఈ వారం సుధీర్‌కు కీలకంగా మారింది. అన్ని సినిమాల్లాగే సోమవారం రోజున గాలోడు చిత్రం యావరేజ్ అక్యుపెన్సీ నమోదు చేసిందంటున్నారు.
అన్ని ప్రాంతాల్లో 25 శాతం అక్యుపెన్సీతో సరిపెట్టుకున్నట్టు టాక్. దాంతో ఈ చిత్రం నిలకడగా వసూళ్లను సాధించిందని అంటున్నారు. నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో గాలోడు 84 లక్షలు రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 5.90 కోట్ల గ్రాస్, 2.65 కోట్ల షేర్ సాధించినిట్టు సమాచారం. ఈ లెక్కన ‘గాలోడు’ బ్రేక్ ఈవెన్ అయి.. లాభాల బాట పట్టిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ‘ఎ’ సెంటర్లో కంటే.. బి, సి సెంటర్లలో గాలోడుకు భారీ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.
ఈ సినిమాతో సుధీర్ క్రేజ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అందుకే గాలోడుకు దాదాపు 50 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నాడని అంటున్నారు సుధీర్ అభిమానులు. అంతేకాదు హీరోగా సుధీర్ మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు చేయాలని అంటున్నారు. మొత్తంగా సుధీర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతున్నాడని చెప్పొచ్చు.