Bollywood: ‘ఆదిపురుష్’తో మరింత జాగ్రత్త.. మూడు భాగాలుగా రామాయణం!
ప్రస్తుతం మైథలాజికల్ సినిమాలను తీసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పటికే రామాయణ ఇతిహాసం ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలే ప్రభాస్ శ్రీరాముడిగా 'ఆదిపురుష్' సినిమా చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత రామయాణం ఆధారంగా మారో భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్దమవుతోంది. బాలీవుడ్లోనే భారీ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అది కూడా మూడు భాగాలుగా రానుందని అంటున్నారు.
‘దంగల్’, ‘ఛిచోరే’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు నితీష్ తివారీ చాలా రోజులుగా రామాయణం ఆధారంగా విజువల్ వండర్‌గా ఓ సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన భారీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ కూడా ఇచ్చాడు. ఖచ్చితంగా రామయాణం ప్రాజెక్ట్ ఉంటుందని.. కానీ దానికి కాస్త సమయం పడుతుందని అన్నారు. ఈ క్రమంలో రాముడు ఎవరు? రావణుడు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.. సీతగా ఆలియా భట్ కనిపించున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి పై లుక్ టెస్ట్ కూడా చేసినట్టు సమాచారం.
ఇక విలన్ రావణుడిగా కెజియఫ్‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న యష్ నటించనున్నాడనే టాక్ ఉంది. గత కొద్ది రోజులుగా మేకర్స్ యష్‌తో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే స్టార్ క్యాస్టింగ్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే తాజాగా ఈ సినిమాను మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే క్లారిటీ మాత్రం వచ్చేసింది. బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘ఈ మధ్య నేను నితీష్ తివారిని కలిశాను. మూడు భాగాలుగా రామాయణాన్ని తెరకెక్కించబోతున్నానని ఆయన నాతో చెప్పారు.
ఎలాంటి వివాదాలకు తావు లేకుండా స్క్రిప్ట్ సిద్ధం చేశానన్నారు. సినిమా సెట్స్‌పైకి వెళ్లే ముందు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలను సంప్రదించి, వారి సలహాలు తీసుకునే ఆలోచనలో నితీష్ తివారి ఉన్నారు’ అని తరణ్ ఆదర్శ్ తెలిపారు. మొత్తంగా ‘ఆదిపురుష్’ సినిమా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. నితీష్ తివారి రామాయణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సినిమాను దీపావళికి గ్రాండ్‌గా లాంచ్ చేసి.. డిసెంబర్ నాటికి సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట.