ఇప్పటి వరకు తెరకెక్కిన సినిమాలన్నీ.. దాదాపుగా మహాభారతంలోని ఏదో ఓ కథతో లింక్ అయ్యే ఉంటాయి. మహా భారతం అంటేనే ఓ సముద్రం.. ఎన్నో కథలకు కేంద్ర బిందువు. అలాంటి భారతం గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. కాకపోతే ఏదో ఒక ఘట్టాన్నే ఆధారంగా తీసుకొని సినిమాలు చేశారు. కానీ మొత్తం మహాభారతాన్నిమాత్రం తెరపైకి తీసుకురాలేదనే చెప్పాలి. వచ్చినా యానిమేటెడ్గానే రూపొందించారు. దర్శక ధీరుడు రాజమౌళి సైతం మహా భారతాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. అయితే ఇంకా తనకు అంత అనుభవం లేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు జక్కన్న. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను రాజమౌళి ఎప్పుడు చేస్తాడో ఇప్పుడే చెప్పకపోయినా.. చేయడం మాత్రం పక్కా.
కానీ ఈ లోపే మహాభారతానికి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దీన్ని భారీగా ప్లాన్ చేస్తోంది. గతంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెనలు కలిసి రామాయణాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రకటనకే పరిమితమైంది. అయితే ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌తో కలిసి మహాభారతాన్ని భారిగా నిర్మించడానికి పూనుకున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మహాభారతాన్ని అధికారికంగా ప్రకటించారు.
మైథోవర్స్ స్టూడియోస్ మరియు అల్లు ఎంటర్టైన్మెంట్లతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా మహాభారతం ఆర్ట్ వర్క్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే మహాభారతాన్ని వెబ్ సిరీస్‌గా తీసుకురాబోతున్నారా.. లేక సినిమాగా ప్లాన్ చేస్తున్నారా.. లేక యానిమేషన్ రూపంలో తీసుకొస్తారా.. అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సినిమా, సిరీస్ చేస్తే ఎవరు నటిస్తారు.. డైరెక్టర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.