అనేక సవాళ్ల మధ్య పరిపాలన సాగిస్తున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్నాడు. లిజ్ ట్రస్ ఆకస్మిక రాజీనామాతో ప్రధాని పదవి రేసులోకి రిషి దూసుకొచ్చాడు. ప్రత్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం రిషి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యాడు. గతేడాది అక్టోబర్ 25న ప్రధానిగా రిషి బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బ్రిటీష్ రాజ్యాన్ని గాడీలో పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ప్రధానిగా వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘లిజ్ ట్రస్ రాజీనామా చేసినప్పుడు నేను రాజకీయాలు ఆలోచించలేదు. ప్రజా సేవను నమ్ముతాను. అన్నిటి కంటే ఎక్కువగా దేశానికి మేలు చేయాలనే కర్తవ్యంతో ఉన్నా. హిందూ మతంలో ధర్మం కర్తవ్యాన్ని బోధిస్తుంది. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ దేశానికి సేవ చేయడమే నా ధర్మం అని నమ్మి ప్రధాని పదవిని అంగీకరించా’ అని రిషి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక అతడి సంపాదన గురించి అడగ్గా ఆర్థికంగా తాను అదృష్టవంతుడినని చెప్పుకొన్న రిషి తన బ్యాంక్ ఖాతాలో ఎంత ఉందన్నది ముఖ్యం కాదని.. తన విలువలు ఏమిటో ముఖ్యమని పేర్కొన్నాడు.
ప్రధాని పదవిని ఒక పీడకల ఉద్యోగంగా రిషి సునాక్ అభివర్ణించాడు. ‘అయినా కూడా ఒక వైవిధ్యంగా చేయగలననే నమ్మకంతో ప్రధాని బాధ్యతలు చేపట్టా. ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆ సమయంలో వైవిధ్యం చూపడానికి నేను అత్యుత్తమ వ్యక్తిని. కష్టం.. సవాలుగా ఉంటుందని తెలుసే ఈ బాధ్యతలు చేపట్టా’ అని రిషి తెలిపాడు. ప్రధాని బాధ్యతలు చేపట్టాక రిషికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా అన్నిటినీ తట్టుకుని దేశాన్ని ఒక గాడీన పెట్టేందుకు శతశిధాల ప్రయత్నిస్తున్నాడు.