చాలా మంది తమ పిల్లలతో సమానంగా పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేరు. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. అలాంటిది ప్రేమగా చూసుకున్న పెంపుడు జంతువు ఏకంగా యజమానినే చంపేస్తే… వినడానికే కష్టంగా ఉంది కదా..? కానీ అదే జరిగింది. ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తిని తాను పెంచుకున్న పెంపుడు జంతువే చంపేసింది. అయితే.. ఆయన పెంచుకున్నది ఓ కంగారుని కావడం గమనార్హం.
కంగారూ 77 ఏళ్ల వృద్ధుడిని చంపిన ఘటన ఆస్ట్రేలియా లో చోటుచేసుకుంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని దక్షిణ పట్టణం రెడ్మండ్లోని ఒక ఇంట్లో తీవ్రమైన గాయాలతో పడి ఉన్న వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ వ్యక్తి ముందు రోజు కంగారూ దాడిలో గాయపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా పోలీసుల ప్రకారం.. గత 86 ఏళ్లలో కంగారు దాడి చేసి ప్రాణాలు తీసిన మొట్టమొదటి ఘటన ఇదేనని తెలిపారు. చివరిసారిగా 1936లో కంగారూ ఓ మనిషిపై దాడి చేసి చంపేసింది.
గాయాలతో ఉన్న బాధితుడి వద్దకు అంబులెన్స్ సిబ్బంది ప్రయత్నించగా.. కంగారూ అడ్డుకుందని పేర్కొన్నారు. దీంతో దాని కాల్చి చంపిన తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.