Dabur honey: ప్రస్తుత పరిస్థితుల్లో కలుషితం లేని వ్యాపారం అంటూ లేదని అందరూ అంటుంటారు. నీళ్ల నుంచి పాల వరకు అన్ని పొల్యూట్ చేస్తున్నారు. తేనె కూడా ఇలానే తయారు చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వాటిని ఆయా సంస్థలు కొట్టిపడేశాయి. ఇప్పుడు ఈ హనీ వ్యాపారంలో దిగ్గజ సంస్థగా ఎదిగినా డాబర్ (Dabur) కంపెనీపై ఓ వార్త వినియోగదారుల గుండెల్లో రైల్లు పరిగెత్తేలా చేసింది. దేశంలో అత్యధికంగా విక్రయం అయ్యే డాబర్ తేనెలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని గురువారం ఓ వార్త హల్ చల్ చేసింది. దాంతో ప్రజల్లో ఆందోళన మొదలయ్యాయి. డాబర్ తేనెలో కార్సినోజెనిక్ మెటీరియల్స్ ఉన్నాయనే వార్తలను డాబర్ ఇండియా ఖండించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తప్పుడు వార్తలను విన్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. డాబర్ హనీ స్వచ్ఛత (Purity)కు హామీ ఇస్తున్నామని తెలిపారు. డాబర్ తేనె ఏ ఫ్యాక్టరీలో తయారైనప్పటికీ, ప్రతీ బ్యాచ్ కూడా ఎఫ్ఎస్ఎస్ఏ ప్రమాణాల మేరకు ఉంటుందని.. ముడి తేనె నుంచి దాన్ని శుద్ధి చేసి, ప్యాకింగ్ అనంతరం తుది ఉత్పత్తిగా తయారయ్యే వరకు అన్ని దశల్లో ఎఫ్ఎస్ఎస్ఏ నాణ్యాతా ప్రమాణాలను పాటిస్తారని డాబర్ ఇండియా సీఎఫ్వో అంకుర్ జైన్ ప్రకటించారు. డాబర్ తేనెలో క్యాన్సర్ కారకాలు లేవని, ఆ వార్తలు తప్పుడు ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. డాబర్ తేనెకి ఇటీవలే ఆగ్ మార్క్(Ag mark) ప్రత్యేక సర్టిఫికెట్ కూడా లభించినట్టు అంకుర్ జైన్ వెల్లడించారు.