KTR: పార్టీలతో కలిసి.. కేంద్రం కుట్రను భగ్నం చేస్తాం
సింగరేణిని ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం కుట్రను తాము భగ్నం చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇప్పటికే బొగ్గు గనుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖ రాసినట్లు తెలిపారు.
కార్మికులను, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని… సింగరేణిని ప్రయివేటీకరణ చేయాలనే భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం కుట్రలను భగ్నం చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (KTR) అన్నారు. సింగరేణిని (singareni coal mines) తాము కచ్చితంగా కాపాడుకుంటామన్నారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసినట్లు వెల్లడించారు. నాలుగు బొగ్గు గనులు తమకే ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారని తెలిపారు. అయితే నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నామని, అందులో పాల్గొనవచ్చునని కేంద్రం చెప్పిందన్నారు. సింగరేణిని కార్మికులందరికీ మాటిస్తున్నాం.. అవసరమైతే ఎంత దూరమైనా పోతాం… సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో ఉన్న కేంద్రం కుట్రను భగ్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు కార్మికులను, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు.
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా కేంద్రం మాట తప్పిందని మండిపడ్డారు. ఇక్కడ స్టీల్ నిక్షేపాలు లేవని కేంద్రమంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం ప్రారంభించామని చెప్పారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో కూడా జిందాల్, మిట్టల్ తదితర సంస్థలతో ప్రాథమికంగా సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. కేంద్రం ముందుకు రాకపోతే ప్రైవేటు రంగం ద్వారా లేదా సింగరేణి ద్వారా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. 2004 నుండి 2014 వరకు ఇసుకపై రూ.39 కోట్ల రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని, అంటే కాంగ్రెస్ హయాంలో సంవత్సరానికి రూ.4 కోట్లు కూడా రాలేదన్నారు. అదే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఏడాదికి రూ.800 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. ఇసుక పాలసీని ఇతర రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారన్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కేటీఆర్ చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యంలో భాగంగా ప్యాట్నీ నుండి సుచిత్ర వరకు స్కైవే నిర్మించాలని భావించి, కేంద్రం సాయం కోరామని, కానీ సహకరించడం లేదని ఆరోపించారు. కేంద్రాన్ని మర్యాదగా అడిగినా సహకారం లేదన్నారు. స్కైవే నిర్మాణానికి భూసేకరణ అవసరమని, అక్కడ డిఫెన్స్ భూములు ఉండటంతో అభివృద్ధికి అడుగులు పడటం లేదన్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో డిఫెన్స్ భూములు ఉన్నాయని, దీనిపై కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ఏడున్నర సంవత్సరాలుగా కేంద్రానికి విజ్ఞప్తులు అందుతూనే ఉన్నాయన్నారు. రక్షణ శాఖలో నలుగురు మంత్రులు మారారని, అందరికీ విజ్ఞప్తులు ఇచ్చామన్నారు. జూబ్లీ నుండి షామీర్ పేట వరకు స్కైవే నిర్మాణానికి తమ ప్రభుత్వం సిద్ధమన్నారు.