విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించాలి. వాటిపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పెను ప్రమాదాలు సంభవిస్తాయి. వాషింగ్ మెషీన్ ఇద్దరి ప్రాణం మీదకు వచ్చింది. ప్రస్తుతం వారు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమవగా.. మంటలు వ్యాపించాయి. ఇంటి బయట పార్క్ చేసిన కారు కూడా పగిలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో రాజూరి బాలయ్య (75), బాలలక్ష్మి (69) భార్యాభర్తలు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి వాషింగ్ మెషీన్ లో బాలలక్ష్మి బట్టలు వేసి స్విచ్ ఆన్ చేసి హాల్ లోకి వెళ్లింది. కొద్దిసేపటికి ఒక్కసారిగా భారీ శబ్ధంతో వాషింగ్ మెషీన్ పేలింది. వెంటనే మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందోనని చూడడానికి వెళ్లిన బాలలక్ష్మికి మంటలు అంటుకున్నాయి. కాపాడేందుకు వెళ్లిన భర్త బాలయ్యకు కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే ఇరుగుపొరుగు వారు గమనించి మంటలను ఆర్పేశారు. వారిద్దరిని కామారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.
అయితే పేలుడు తీవ్రత అధికంగా ఉంది. ఇంటి తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన ఓ కారు అద్దాలు పగిలిపోయాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు పోలీసులు తెలుసుకుంటున్నారు. షార్ట్ సర్క్యూట్ తో మెషీన్ లోని మోటార్ పేలి ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.