ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి (andhra pradesh development) విషయంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు (telangana minister harish rao) వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, తెలంగాణ నేతలను వైసీపీ నేతలు (ycp leaders) తిట్టడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (janasena chief pawan kalyan) అన్నారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య తెలంగాణ మంత్రి ఒకరు (హరీష్ రావు – harish rao)) ఏపీ అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయని, ఆయన వ్యాఖ్యలకు ఏపీ వైసీపీ నేతలు (ap ycp leaders) ప్రతిస్పందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు హద్దులు దాటి మాట్లాడటం కాస్త ఇబ్బందికరంగా మారిందన్నారు. జనసేన పార్టీ (janasena party) మొదటి నుండి చెప్పేది ఒకటేనని, పాలకులు వేరు, ప్రజలు వేరు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదన్నారు. ఇది తెలంగాణకు, ఏపీకి వర్తిస్తుందన్నారు. పాలకుల వ్యాఖ్యలకు ప్రజలకు వర్తింప చేయవద్దన్నారు.
ఏదేమైనా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు స్పందించే క్రమంలో… తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తనకు వ్యక్తిగతంగా మనస్తాపం కలిగించిందన్నారు. దయచేసి వైసీపీ నాయకులకు నేను విన్నపం చేసేది ఒకటేనని, కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. మీరు తిట్టాలనుకుంటే సదరు మంత్రిని లేదా వ్యక్తిని అనుకోవచ్చునని చెప్పారు. కానీ ఈ వివాదంలోకి తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే ఏపీకి కూడా వర్తిస్తుందన్నారు. ప్రజలను, పాలకుల నుండి వేరు చేయలన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు కూడా తమ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలపై స్పందించాలని, జాతిని మాట్లాడటం తప్పు అని హితవు పలకాలన్నారు. తెలంగాణలో మీ అందరికి వ్యాపారాలు లేవా.. ఇళ్లు లేవా.. అని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ వంటి వారు ఒకప్పుడు ఇక్కడ కేబుల్ వ్యాపారాలు చేయలేదా అని ప్రశ్నించారు. మీ నేతలు ఎవరైనా పొరపాటుగా మాట్లాడితే ముఖ్యమంత్రి సహా అందరూ ఖండించాలన్నారు. తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.