తెలుగు దేశం (Telugu Desam) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) తన యువ గళం (yuva galam) పాదయాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు.
తెలుగు దేశం (Telugu Desam) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) తన యువ గళం (yuva galam) పాదయాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో ఆయన నడుస్తుండగా.. మద్యం దుకాణాలకు సరఫరా చేసే వాహనం వెళ్తోంది. ఆ సమయంలో అందులోని బ్రాండ్లను చూపిస్తూ సెల్ఫీ దిగారు. ఆ వ్యాన్ లో బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్, మలబార్ హౌస్ వంటి మద్యం బ్రాండ్స్ ఉన్నాయి.
కాగా పాదయాత్ర లో లోకేష్.. జగన్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో విశాఖపట్నంలో జగన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహిస్తున్నారని, ఐతే అపారమైన సహజ వనరులు, సౌకర్యాలు రాష్ట్రానికి ప్రయోజనమేనని, కానీ జగన్ మాత్రమే మైనస్ అన్నారు. ఈ సమయంలో రాష్టానికి జగన్ ముఖ్యమంత్రి గా ఉండడం ప్రతికూలత అన్నారు. తెలుగు దేశం పార్టీ హయంలో వచ్చిన ఫ్యాక్స్ కాన్ సంస్థ ఇప్పుడు తెలంగాణకు తరలి పోయింది అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో పెద్దిరెడ్డి రూ.10 వేల కోట్లను దోచుకున్నాడని ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎవరు క్వారీ నిర్వహించుకోవాలన్నా పెద్దిరెడ్డికి 50 శాతం కమీషన్ ఇవ్వాలన్నారు. ఒక నియోజకవర్గంలో రూ.50 కోట్లు, జిల్లా వ్యాప్తంగా రూ.500 కోట్లను సంపాదించుకున్నారన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో వెంకటరెడ్డి యాదవ్, నాగభూషణం, భాస్కర్‌రెడ్డి భూముల్ని కబ్జా చేస్తున్నారని, వారికి భయపడి రైతులు రాత్రిళ్లు టార్చి లైట్లు వేసుకుని తమ భూములకు కాపలా కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 కోట్ల విలువ గల 300 ఎకరాల ఫారెస్టు భూమిని పెద్దిరెడ్డి దోచేశారన్నారు. పెద్దిరెడ్డిని ఎవరైనా సరే పెద్దాయన అని పిలవాలంట. ఎందుకు పిలవాలి? గంజాయిని సరఫరా చేస్తున్నందుకా? భూములు దోచుకున్నందుకా? ఇసుక తిన్నందుకా? మట్టి మాఫియాను ప్రోత్సహించినందుకా? అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి తనను అడగకపోయినా, పుంగనూరు అభివృద్ధికి రూ.వంద కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు.