ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు రావొచ్చునని, కాబట్టి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ రాష్ట్రానికి వెళ్లాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం హితవు పలికారు. తెలంగాణ బడ్జెట్ పైన షర్మిల మాట్లాడటం బాధాకరమన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆమె పాదయాత్ర చేశారని, కానీ అలాంటి సోదరికి ఆయన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి షర్మిల తనకు జరిగిన అన్యాయం గురించి ఆంధ్రాకు వెళ్లి మొరపెట్టుకోవాలని సూచించారు. రేపో మాపో, జగన్ జైలుకు వెళ్తే అవకాశం వచ్చేది ఆమెకేనని చెప్పారు. తెలంగాణలో పార్టీ అంటూ తిరగడం ద్వారా షర్మిల తన సమయాన్ని వృధా చేసుకోవద్దని హితవు పలికారు.
బడ్జెట్ పైన షర్మిల కూడా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిందన్నారు. కానీ ఆమెను చూస్తే జాలి వేసిందన్నారు. ఆమెకు రాజకీయ సలహాలు ఇస్తున్నది, రాజకీయంగా ముందుకు నడుపుతున్నది ఎవరో తనకు తెలియదు కానీ… ఆమె తప్పుడు సలహాలు ఇస్తున్నారని చెప్పారు. షర్మిల తెలంగాణలో తిరగడం ద్వారా తన సమయాన్ని, శక్తిని, వనరులను వృథా చేసుకోవడం తప్ప మరేమీ లేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడుగడుగునా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక జగన్ విషయానికి వస్తే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసైన రోజు సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించారన్నారు. సమైక్యాంధ్రే మా నినాదం అంటూ షర్మిల ఊరువాడ తిరిగారని గుర్తు చేశారు. అలాంటప్పుడు వైయస్ కుటుంబానికి తెలంగాణలో రాజకీయం చేసే నైతికత లేదన్నారు. తెలంగాణ ఏర్పాటునే అడ్డుకున్న మీరు ఇక్కడ రాజకీయం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.
జగన్ సీబీఐ కేసుల్లో ఇరుక్కొని, జైలుకు వెళ్లినప్పుడు వైసీపీని నిలబెట్టేందుకు షర్మిల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. షర్మిలతో పాటు విజయమ్మ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. వీరి పాదయాత్ర కారణంగా జగన్ సీఎం అయ్యారని, కానీ ఆ తర్వాత వారి కుటుంబంలో విబేధాలు వచ్చి, తల్లిని, చెల్లిని పక్కన పెట్టారన్నారు. షర్మిలకు తన అన్నయ్య అన్యాయం చేసిన మాట వాస్తవమన్నారు. మీ కష్టం ద్వారా జగన్ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మరిచిపోయి, మీకు రాజకీయంగా అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఏపీలో జగన్ గ్రాప్ రోజురోజుకు పడిపోతుందన్నారు. షర్మిలకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఏపీకి వెళ్లి మొరపెట్టుకోవాలన్నారు. మా అన్న నాకు అన్యాయం చేశాడని ఏపీలో చెప్పాలన్నారు.