»Indian American Neal Mohan To Take Over Youtube As Ceo Steps Down
YouTube CEO Neal Mohan: యూట్యూబ్ సీఈవోగా భారతీయ అమెరికన్
వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్‌ను నియమించింది.
వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్‌ను నియమించింది. ఈ మేరకు ఆమె కొత్త సీఈవో పేరును ప్రకటించారు. యూట్యూబ్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ (chief product officer) మన యూట్యూబ్‌కు కొత్త హెడ్ అంటూ బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. కొత్త సీఈవో నీల్ మోహన్‌తో సూసన్‌కు మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరు మొదట గూగుల్ సంస్థలో యాడ్ విభాగంలో పని చేశారు. తాను నీల్‌తో కలిసి పదిహేనేళ్లుగా పని చేస్తున్నానని, 2007లో గూగుల్‌లో చేరినప్పటి నుండి తాను చూస్తున్నానన్నారు. తమ ఉత్పత్తులపై, వ్యాపారంపై, క్రియేషన్‌పై, యూజర్ కమ్యూనిటీపై, అలాగే ఉద్యోగులపై అతనికి అద్భుతమైన ఆలోచన ఉందని ప్రశంసించారు. తనను సీఈవోగా ప్రకటించిన నేపథ్యంలో నీల్ మోహన్ ట్వీట్ చేశారు. సూసన్ వొజిసికి థ్యాంక్స్ చెబుతూ.. మీతో కలిసి పని చేయడం అద్భుతమని, యూట్యూబ్‌ను ఎంతో తీర్చిదిద్దారని, మీ దారిలో దీనిని ముందుకు తీసుకు వెళ్తానని పేర్కొన్నారు. నీల్ మోహన్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్. 2007-08లలో గూగుల్‌లో చేరారు. నిన్నటి వరకు యూట్యూబ్‌లో చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు. యూట్యూబ్ షార్ట్స్, మ్యూజిక్ పైన ప్రత్యేక దృష్టి సారించారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్‌లో పని చేశారు.
ఉద్యోగులకు లేఖ
సీఈవో బాధ్యతల నుండి తప్పుకున్న వొజిసికి వయస్సు 54. తాను ఫ్యామిలీ, హెల్త్, పర్సనల్ ప్రాజెక్టుల పైన దృష్టి సారించానని, దీంతో కొత్త వారిని తీసుకుంటున్నట్లు తెలిపారు. బాధ్యతల నుండి తొలగుతున్న సమయంలో ఆమె ఉద్యోగులకు లేఖ రాశారు. తాను కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అల్పాబెట్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గె బ్రిన్ ఆమె సేవలను ప్రశంసించారు. గూగుల్ చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రతిచోట ప్రజలు ఉపయోగించే ఉత్పత్తులకు ఆమె అత్యంత సహకారం అందించారని తెలిపారు. సీఈవో కంటే ముందు ఆమె ప్రముఖ సెర్చింజన్ సంస్థ గూగుల్లోయాడ్ ప్రోడక్ట్స్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత 2014లో యూట్యూబ్‌కు సీఈవో అయ్యారు. గూగుల్ సంస్థకు తొలి ఉద్యోగుల్లో ఈమె ఒకరు. మాతృసంస్థ అల్పాబెట్ ఇంక్‌తో కలిసి 25 ఏళ్లు ప్రయాణం కొనసాగించారు. గూగుల్ కంటే ముందు ఆమె ఇంటెల్ కార్ప్ అండ్ బెయిన్ & కంపెనీలలో పని చేశారు. సూసన్ యూట్యూబ్ సీఈవోగా ఉన్న సమయంలో పరుగెత్తిందనే చెప్పవచ్చు. కంపెనీ కూడా మంచి లాభాలను ఆర్జించింది. యూట్యూబ్ ప్రకటనల ద్వారా గత ఏడాది 29.2 బిలియన్ డాలర్లు సంపాదించింది. మాతృసంస్థ అల్ఫాబెట్ ఆదాయంతో పోలిస్తే ఇది ఎక్కువ.
భారతీయుల హవా
ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్, IBM చైర్మన్ అండ్ సీఈవోగా అర్వింద్ కృష్ణ ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్ జత కలిశారు. పరాగ్ అగర్వాల్ గత ఏడాది వరకు ట్విట్టర్ సీఈవోగా ఉన్నారు. కాబి ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత తప్పించారు.