ఆస్ట్రేలియాతో జరిగిన నేటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో 4-1 తేడాతో భారత్ ముందంజలో నిలిచి సిరీస్ కైవసం చేసుకోనుంది.
నేడు జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ టీ20 సిరీస్‌లో ఇది వరకూ మూడు మ్యాచులు జరగ్గా అందులో రెండు భారత్ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఆసీస్ గెలుపొందింది. అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ సిరీస్‌లో ముందంజలో ఉంది. తొలి మూడు మ్యాచుల్లో 200కి పైగా స్కోర్ చేసిన భారత్ నాలుగో మ్యాచ్‌లో మాత్రం 174 పరుగులకే సరిపెట్టుకుంది.
రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బ్యాటర్ రింకూ సింగ్ 46 పరుగలు చేయగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 37, రుతురాజ్ గైక్వాడ్ 32, జితేశ్ శర్మ 35, శ్రేయస్ అయ్యర్ 8 పరుగులు చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1 పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షూయిస్ 3, జాసన్ బెహ్రెండార్ఫ్ 2, తన్వీర్ సంఘా 2, ఆరోన్ హార్డీ 1 వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఆసీస్ బ్యాటర్లు ఎంత పోరాడినప్పటకీ టార్గెట్ రీచ్ కాలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే ఆసీస్ చేయగలిగింది. దీంతో భారత్ జట్టు నాలుగో టీ20 మ్యాచ్ లో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచుల విజయంతో టీమిండియా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో మ్యాచ్ మాత్రమే జరగనుంది.