»Etala Rajender Calls To Defeat Kcr In Next Elections
Eatala Rajender: ఇంటికో రాముడు బయలుదేరి, కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇంటికో రాముడు తనను గెలిపించినట్లుగా భావిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లోను తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఓ రాముడు వచ్చి కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు ఈటెల రాజేందర్.
ప్రతి ఇంటి నుండి ఓ రాముడు (Lord Rama) బయలుదేరి, ఈ ప్రజా కంఠక పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Huzurabad MLA Etala Rajender) అన్నారు. శ్రీరాముడి చరిత్ర, మానవ సంబంధాలు తెలిపే ఇతిహాసం.. రామాయణం (ramayanam) అన్నారు. తండ్రి మాటను జవదాటని రాముడు, లక్ష్మణుడు ఆచరణలో చూపించారని, అన్నదమ్ములు, భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలో చెప్పిన మహనీయుడు రాముడు అని, అందుకే సంక్షేమ రాజ్యాన్ని, ప్రజారాజ్యాన్ని రామ రాజ్యంతో పోలుస్తారని, అలాంటి రామరాజ్యం రావాలని ప్రజలందరు కోరుకుంటారని వ్యాఖ్యానించారు ఈటల. హుజురాబాద్ లో ఇంటికి ఓ రాముడు (Lord Rama) ఉన్నారని, అందుకే ధర్మాన్ని గెలిపించారని చెప్పారు. ఆనాడు కేసీఆర్ (Chief Minister of Telangana K Chandrasekhar Rao) వేల కోట్లు ఖర్చు పెట్టినా, ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేసినా, ఆత్మ గౌరవానికి వెల కట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ రోజు ఇక్కడి ప్రజలు తనకు అండగా నిలబడి, గొప్పగా గెలిపించారన్నారు. అందుకే ఇక్కడ ఇంటికో రాముడు ఉన్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు.
రాబోయే కాలంలోను తెలంగాణలో ఇంటికో రాముడు వచ్చి.. కేసీఆర్ ధన ప్రవహాన్ని, దౌర్జన్యాలను, ప్రలోభాలను అడ్డుకొని, ఈ దుర్మార్గ పాలనను అడ్డుకొని, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయాడని, డబ్బును నమ్ముకొని గెలవాలనుకుంటున్నాడని మండిపడ్డారు. ఆ కలలు కల్లలు అయ్యే రోజు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. అందుకే ఆత్మీయ సమ్మేళనాల పేరిట గ్రామ గ్రామాన దావతులు ఇస్తున్నారని, కల్యాణ లక్ష్మి చెక్కులు, పెన్షన్లు, రైతు బంధు నిధులు, డబుల్ బెడ్ రూం ఇళ్ళు తమతోనే వస్తుందని మోసపు పూరిత మాటలు చెప్తున్నారని ఆరోపించారు.
ఎనిమిదిన్నర సంవత్సరాలుగా కెసిఆర్ ఎలాంటి మోసం చేస్తున్నారో చూశాక కూడా, మరోసారి గెలిపించాలనే ఆలోచనతో ఉండి, మరోసారి మోస పోవద్దన్నారు. ప్రజలందరూ డబ్బు సంచులను, మద్యం సీసాల ప్రలోభాల ప్రవాహాలను, దౌర్జన్యాలు, దుర్మార్గపు హెచ్చరికలను ఖాతరు చేయకుండా రాముని కళ్యాణం సందర్భంగా ధర్మం నిలబెట్టు కుంటామని ప్రతిన పూనాలని, రామరాజ్యం తెచ్చుకోవాలన్నారు. కాగా, ఈటల రాజేందర్ అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.