అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు తమపై చేసినవి కాదని ఏకంగా భారతదేశం మొత్తంపై చేసిన దాడిగా భారత వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదానీ అభివర్ణించాడు. అది తమ సంస్థపై చేసిన దాడి కాదని భారతదేశం, భారతీయ సంస్థలు, స్వాతంత్య్రం , నాణ్యత, ఆర్థిక వృద్ధిపై దాడిగా పేర్కొంది. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టి పారేసింది. తప్పుడు ఆరోపణలని, అవాస్తవాలు, నిరాధారామైనవని పేర్కొంది. ఈ సందర్భంగా 413 పేజీల్లో అదానీ గ్రూప్ వివరణ ఇచ్చింది.
మార్కెట్ లో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసి దానిద్వారా ఆర్థిక లాభాలు పొందాలనే దురుద్దేశంతోనే అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ తమపై ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ పేర్కొంది. ఎలాంటి కారణాలు లేకుండా, ఎలాంటి పరిశోధన చేయకుండా హిండెన్ బర్గ్ నివేదికను విడుదల చేసిందని ఆరోపించింది. హిండెన్ బర్గ్ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు తమ గ్రూపు కంపెనీలు సమాధానం ఇచ్చాయని తెలిపింది. మరో 23 ప్రశ్నల్లో 18 తమ వాటాదార్లు, థర్డ్ పార్టీలకు సంబంధించినవని వివరించింది. మిగిలిన 5 ప్రశ్నలు తమపై నిరాధార ఆరోపణలు అని అదానీ గ్రూపు పేర్కొంది. తమ కంపెనీలన్నీ చట్టాలు, నిబంధనలకు లోబడి పని చేస్తున్నాయని స్పష్టం చేసింది.
కాగా అదానీ గ్రూప్ ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి. ఒక కంపెనీపై జరిగిన దాడిని యావత్ భారతదేశానికి అంటగట్టడం సరికాదని కాంగ్రెస్ లోని సీనియర్ నాయకుడు స్పష్టం చేశాడు. లాభాలు వస్తే కంపెనీకి.. నష్టాలు వస్తే అవి దేశానిదా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో స్నేహం వలనే అదానీ ఈ స్థాయికి చేరాడని, వారిద్దరి మధ్య అనుబంధంతో వ్యాపారం బాగా పెరిగిందని ఆరోపించారు.